The Raja Saab Special Song :ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో 'రాజా సాబ్' ఒకటి. మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇది ముగింపు దశ చిత్రీకరణలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు మేకర్స్ ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌కు ప్రభాస్‌తో కలిసి ఓ కోలీవుడ్ బ్యూటీ స్టెప్పులేయనున్నట్లు అప్పట్లో టాక్ నడించింది. అయితే తాజాగా ఈ విషయం గురించి మరోసారి చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.
ఈ సినిమాలోని ఓ సాంగ్ కోసం ఇప్పటికే ఆమెను అప్రోచ్ అవ్వగా, దానికి ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరు లేకుంటే వచ్చే నెలలో ఆ సాంగ్ షూటింగ్ జరిగే అవకాశముందని సినీ వర్గాల టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ స్టార్ పెయిర్‌ను ఒకటే స్క్రీన్‌పై మళ్లీ చూసే అవకాశం దక్కనుందని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా
అయితే ప్రభాస్, నయనతార చివరిగా 2007లో విడుదలైన 'యోగి'లో నటించారు. ఈ ఇద్దరి జోడి బాగుందంటూ అప్పట్లో టాక్ కూడా నడిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఇప్పుడు ఈ 'రాజాసాబ్'తో వీరు తిరిగి కలవనున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.