Suriya Janvikapoor :అలనాటి అందాలతార శ్రీదేవి కూతురిగా వెండితెరకు పరిచయమైంది హిందీ భామ జాన్వీ కపూర్. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్లో వరుస సినిమాలు చేసిన ఈ అందాల భామ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీవైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న దేవర చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో సూపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. స్టార్ హీరో సూర్యతో కలిసి నటించబోతున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సూర్య - బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మిశ్రా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్న ప్రాజెక్ట్ 'కర్ణ' (Suriya Karna Movie)లో నటించబోతున్నారు. మహాభారతంలోని కర్ణుడి పాత్రను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.500కోట్లు అని అంటున్నారు. ఇందులోనే జాన్వీ కథానాయికగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి కానీ, జాన్వీ టీమ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశముందని అంటున్నారు.