Star Heros Titles History :థియేటర్లలో కానీ ఓటీటీల్లో కానీ హీరో ఎంట్రీకి ముందు వారి పేరుతో పాటు వారికి ఉన్న స్పెషల్ ట్యాగ్‌ను వేస్తారు. దాదాపు ప్రతి హీరోకూ అటువంటి ట్యాగ్ ఉంటుంది. మెగాస్టార్, సూపర్ స్టార్, యంగ్ రెబల్ స్టార్, యంగ్ టైగర్ లాంటి ట్యాగ్స్ కలిగిన స్టార్స్ ఉండగా, వీటితోపాటు పవర్ స్టార్, ఐకాన్ స్టార్, ఎనర్జిటిక్ స్టార్, నేచురల్ స్టార్ తదితర బిరుదులూ ఉన్నాయి.
ఇక బీటౌన్‌లో అమితాబ్ బచ్చన్‌ను తమ ఫ్యాన్స్ ముద్దుగా బిగ్‌బీ అని పిలుస్తారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ త్రయాలను వారి వారి ట్యాగ్స్తోనే పిలుస్తుంటారు. అలాగే తమిళంలో రజనీకాంత్‌ను ఆయన పేరుకంటే సూపర్ స్టార్ అనే పిలుస్తుంటారు అభిమానలు. ఇక కమల్ హాసన్‌ను లోకనాయకుడు అని, విజయ్‌ని దళపతి, అజయ్‌ని తలా అని ముద్దుగా పిలుస్తారు. అయితే ఇంతకీ వీళ్లకు ఈ టైటిల్స్ ఎవరు ఇచ్చారు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?
ఇతర ఇండస్ట్రీల సంగతి పక్కనపెడితే తెలుగు హీరోలకు ఉన్న టైటిల్స్‌లో ఓ ప్రత్యేకత ఉంది. అవి కొన్ని హీరోల విషయంలో క్రమంగా మారతూ వచ్చాయి కూడా. ఉదాహరణకు అల్లు అర్జున్ - వీవీ వినాయక్ కాంబోలో తెరకెక్కిన 'బన్నీ' సినిమా ఎంట్రీలో స్టైలిష్ స్టార్ అనే టైటిల్ వేశారు. ఇక అప్పటి నుంచి ఆయన్ను అందరూ ఆ పేరుతోనే పిలవడం మొదలెట్టారు. అయితే 'పుష్ప' సక్సెస్ తర్వాత ఆయన ఐకాన్ స్టార్‌గా మారిపోయారు.
చిరంజీవి తనయుడుగా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్‌ను మెగా పవర్ స్టార్‌గా పిలిచేవారు. అయితే 'ఆర్ఆర్ఆర్'తో ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిన ఈయన్ను ఇప్పుడు ఫ్యాన్స్ ముద్దుగా గ్లోబల్ స్టార్ అని అంటున్నారు.