SSMB29 Mahesh babu SS Rajamouli : సూపర్ స్టార్ మహేశ్‌బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే తాజాగా మరికొన్ని విషయాలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
బిగ్ ప్రెస్‌మీట్ : మహేశ్ బాబుతో సినిమా ఉంటుందని జక్కన్న ప్రకటించారు కానీ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల గురించి అఫీషియల్‌గా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఆయన తన గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్ పెట్టి డీటెయిల్స్‌ను చెబుతారా? లేదా? అన్న దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈ సారి రాజమౌళి కాస్త పెద్దగానే ప్లాన్ చేస్తున్నారట. లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాకు ఒకేసారి చెప్పాలని అనుకుంటున్నారట.
మొదలయ్యేది ఎప్పుడంటే? : సినిమా యాక్షన్ అడ్వెంచర్ అవ్వడం వల్ల ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఎక్కువ సమయం పడుతోందట. ప్రస్తుతం సినిమా కథకు తగ్గట్టుగా పాత్రలు, వాటి స్కెచ్‌లను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అలానే సెట్స్ డిజైన్ కూడా చేస్తున్నారట. సినిమాకు కొత్త టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేయాలి? అన్నదానిపై కూడా చర్చ నడుస్తోందట.
ప్రమోషన్స్ కోసం : సోషల్‌మీడియా టీమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన థీమ్స్, లోగోలను రెడీ చేస్తున్నారట. ఈ పనులన్నీ ఓ కొలిక్కి వస్తే కానీ సినిమాను అనౌన్స్ చేస్తారట. తెలుగు సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 9న సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయాలని మొదట అనుకున్నారట. కానీ ప్రీ ప్రొడక్షన్ కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున మహేశ్ పుట్టినరోజు ఆగస్టు 9న మొదలుపెడతరాని తెలుస్తోంది.