Srimanthudu Koratala Siva : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో గతంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీమంతుడు'. 2015లో విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అయితే ఈ మూవీ స్టోరీ విషయంలో గత ఏడేళ్లుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడిదే విషయంలో సుప్రీం కోర్టులోనూ దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురైంది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఇదీ జరిగింది : 'శ్రీమంతుడు' కథను స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారంటూ రచయిత శరత్ చంద్ర గతంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో నాంపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ, కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఆ తర్వాత మళ్లీ 'శ్రీమంతుడు' కథను కాపీ కొట్టారంటూ ఉన్న ఆధారాలను రచయిత శరత్ చంద్ర కోర్టుకు సమర్పించారు. అవి నిజమైనవేనని నిర్ధారిస్తూ రచయితల సంఘం కూడా నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు, నాంపల్లి న్యాయస్థానం ఉత్తర్వులను సమర్థించింది.