Squid Game Copy Allegations :తన సినిమా కథను కాపీ కొట్టి పాపులర్ కొరియన్ డ్రామా 'స్క్విడ్ గేమ్'ను తెరకెక్కించారని తాజాగా ఓ బాలీవుడ్ డైరెక్టర్ కోర్టును ఆశ్రయించారు. తన సినిమాలోని కథ, అలాగే ఈ సిరీస్‌లో చూపించిన కథ ఒకటేనంటూ చెప్పుకొచ్చిన ఆయన, ఈ విషయంలో తనకు నష్టపరిహారం అందించాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్, అలాగే సిరీస్ రచయిత హ్వాంగ్ డాంగ్ హ్యుక్‌పై తాజాగా దావా వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సోహమ్ షా రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'లక్'. సంజయ్ దత్, మిథున్ చక్రవర్తి, ఇమ్రాన్ ఖాన్ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. శ్రుతిహాసన్ ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే 2009లో వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.
అయితే ఇప్పుడు ఈ సినిమానే కాపీ కొట్టి 'స్క్విడ్ గేమ్'ను తెరకెక్కించారంటూ సోహమ్ షా తాజాగా న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. ఇది కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ఆయన దావా వేశారు. అంతేకాకుండా ఈ సిరీస్‌ను వెంటనే స్ట్రీమింగ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ తొలగించాలని కోరారు.
ఇదిలా ఉండగా, డైరెక్టర్ ఆరోపణల గురించి నెట్‌ఫ్లిక్స్ తాజాగా స్పందించింది. ఆ డైరెక్ట్ చేసింది కేవలం ఆరోపణలు మాత్రమేనని, అందులో ఎటువంటి నిజాలు లేవంటూ పేర్కొంది. ఈ కథను రాసింది, డైరెక్ట్ వహించింది హ్వాంగ్ డాంగ్ హ్యుక్ మాత్రమేనంటూ తెలిపింది.