Shreya Ghoshal On RG Kar Case Song : పశ్చిమ బంగాల్ కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించిన నిరసనలు ఇంకా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ గతంలో తన కాన్సర్ట్‌ను వాయిదా వేసుకుంది. అయితే తాజాగా ఆమె ఆ కాన్సర్ట్‌ను నిర్వహించింది. ఆల్ హార్ట్స్ టూర్‌లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఘనంగానే ఈ ఈవెంట్ జరిగింది.
ఈ ఈవెంట్లో శ్రేయా ఘోషల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఎమోషనల్ సాంగ్‌ను ఆలపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు మీరు వింటున్నారు" అంటూ సాగే సాంగ్‌ను శ్రేయా ఘోషల్ ఉద్వేగభరింతగా పాడింది. ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎదుర్కొనే బాధ, వారి ఆవేదనను ఆమె ఈ పాట రూపంలో తెలిపింది. ఈ సాంగ్‌కు ఎవరూ చప్పట్లు కొట్టొద్దని ఆడియెన్స్‌కు విజ్ఞప్తి చేసింది. ఆమె పాట పాడడం పూర్తయ్యాక శ్రోతలు వీ వాంట్ జస్టిస్ నినాదాలతో స్టేడియం మొత్తాన్ని హోరెత్తించారు.
ప్రశంసించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు - శ్రేయ ఘోషల్ ఈవెంట్‌పై, ఆమె పాడిన పాటపై తృణముల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కునాల్ ఘోష్ ప్రశంసించారు. ఓ పోస్ట్ కూడా పెట్టారు. "ఈ ఘటనపై శ్రేయా ఘోషల్ ఎంతో బాధపడ్డారు. కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇప్పుడు మహిళల భద్రతపై పాటను పాడి హృదయాలను కదిలించారు. హత్యాచారాల ఘటనలపై నిరసనలు అవసరం" అని పేర్కొన్నారు.