Shobita Naga Chaitanya Engagement : అక్కినేని నాగచైతన్య రెండో వివాహం చేసుకుంటున్నారు. ప్రముఖ నటి శోభిత ధూళిపాళతో ఈ ఉదయం 9.42 గంటలకు నాగార్జున నివాసంలో ఈ జంటకు సింపుల్‌గా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని చైతూ తండ్రి, హీరో అక్కినేని నాగార్జున ధ్రువీకరిస్తూ, శోభితను ఎంతో సంతోషంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. "చైతన్య, శోభితలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజు అనంతమైన ప్రేమకు ఆరంభం" అంటూ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఫొటోలను ఎక్స్ లో పంచుకున్న నాగార్జున వారిద్దరు జీవితాంతం ప్రేమగా, సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే, 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత 2016లో 'రామన్ రాఘవన్' అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తెలుగు, హిందీ, మలయాళ, చిత్రల్లోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా 'పొన్నియిన్ సెల్వన్', 'మేజర్' సినిమల్లో సూపర్ పెర్ఫామెన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్‌లోనూ ఇటీవలే ఆమె అడుగుపెట్టింది. దీంతో పాటు ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా, నాగ చైతన్య కూడా 'తండేల్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హైదరబాద్‌లో శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే సినిమాలోని కీలక సన్నివేశాలను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో చైతూతో పాటు సాయి పల్లవి నటిస్తోంది. చందూ ముందేటి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.