Sequel Movies In Tollywood :వాస్తవానికి ఒకప్పుడు టాలీవుడ్లో సినిమాలకు సీక్వెల్స్ అంటే దానికి దాదాపు నో అనే చెప్పేవారు. సూపర్ హిట్ సినిమాలకు వచ్చిన సీక్వెల్స్ ఏవీ కూడా పెద్దగా వర్కౌట్ అయ్యేవి కాదు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అలాగే మాస్ మహారాజ రవితేజ లీడ్ రోల్లో తెరకెక్కిన 'కిక్' సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కిక్ 2 సినిమా కూడా నిరాశగానే మిగిలింది.
గతంలో 'ఆర్య' సినిమా సీక్వెల్‌గా వచ్చిన 'ఆర్య 2' కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న వసూళ్లు సాధించలేకపోయింది. ఇలా టాలీవుడ్లో సీక్వెల్స్ పెద్దగా ఆడిన సందర్భాలు లేవు. అయితే ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ 'బాహుబలి' సినిమా సీక్వెల్ తొలి పార్ట్‌ను మించిన బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలా మరోసారి సీక్వెల్స్ పండుగను టాలీవుడ్‌కు తెచ్చారు రాజమౌళి.
ఇక రాజమౌళి బాటలోనే డైరెక్టర్ సుకుమార్ కూడా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక అదే కోవలో కేజిఎఫ్ సృష్టికర్త ప్రశాంత్ నీల్ కూడా 'సలార్ 2'ను సిద్ధం చేస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన మాసివ్ సక్సెస్ అందుకున్న 'హనుమాన్' సినిమా కూడా 'జై హనుమాన్' ( హనుమాన్ 2), తెరకెక్కేందుకు సిద్ధమవుతోంది.
మరోవైపు సిద్దు జొన్నలగడ్డ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం డీజే టిల్లు కూడా టిల్లు స్క్వేర్ పేరిట సీక్వెల్‌ను సిద్ధం చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇంకా 'దేవర 2', 'యానిమల్ 2' (యానిమల్ పార్క్), 'కాంతార 2', అఖండ 2, 'కల్కి 2' , 'ఓజీ2', 'గూఢచారి 2', 'హిట్ 3','ఈగల్ 2', 'సైంధవ్ 2' చిత్రాలు కూడా వస్తున్నాయి.
అయితే తమ కంటెంట్ మీదున్న నమ్మకంతో కచ్చితంగా సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తామని మరికొందరు మేకర్స్ మొదటి పార్ట్ ను విడుదల చేశారు. అయితే కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయాయి. అలాంటి చిత్రాల్లో గత ఏడాది విడుదలైన 'పెదకాపు', 'స్కంద' పంటి చిత్రాలు ఉన్నాయి.