Saripodhaa Sanivaaram Movie Review :ఎప్పటికప్పుడు జానర్లు మారుస్తూ సినిమాలు చేస్తున్న హీరో నాని, 'అంటే సుందరానికి' తర్వాత సాలిడ్ యాక్షన్ మూవీతో తిరిగొస్తున్న వివేక్ ఆత్రేయ కలిసి పనిచేసిన లేటెస్ట్ మూవీ ఇది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?
స్టోరీ ఏంటంటే :
సూర్య (నాని)కి చిన్నప్పట్నుంచీ చాలా కోపం ఎక్కువ. దాన్ని అదుపులో పెట్టడానికి తాను చనిపోతున్నప్పుడు ఓ మాట తీసుకుంటుంది ఆమె తల్లి ఛాయాదేవి (అభిరామి). ఇక అప్పట్నుంచి హీరో వారమంతా ఎంతగా కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ, శనివారం మాత్రమే దానికి కారణమైన వాళ్ల పని పడుతుంటాడు. అంటే వారమంతా చిత్రగుప్తుడులా చిట్టా రాసుకుంటూ ఉండే సూర్య శనివారం మాత్రం యముడిలా చెలరేగిపోతాడన్న మాట. అతడు ఇలా చేయడం వల్ల ఆ గొడవలు కాస్త ఇంటిదాకా వస్తుంటాయి. దీంతో తండ్రి (సాయికుమార్), అలాగే అక్క (అదితి) చాలా ఇబ్బందులు పడుతుంటారు.
అయితే అనుకోకుండా ఓ సారి సూర్య చిట్టాలోకి సీఐ దయానంద్ (ఎస్.జె.సూర్య) చేరుతాడు. తన సొంత అన్న కూర్మానంద్ (మురళీశర్మ)తోనే వైరం ఉన్న సీఐ దయానంద్ కథేమిటి? అతడికి, సోకులపాలెం అనే ఊరికీ ఉన్న సంబంధమేంటి? దయానంద్‌పై సూర్యకు ఉన్న కోపం, సోకులపాలేనికి ఏ రకంగా మేలు చేసింది? అసలు వీళ్ల కథలోకి చారులత (ప్రియాంక మోహన్) ఎలా ఎంట్రీ ఇచ్చిందనేదే అన్నదే మిగతా స్టోరీ.
సినిమా ఎలా ఉందంటే :
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మార్క్ తెలివైన కథనంతో సాగే ఓ యాక్షన్ డ్రామా ఇది. విడుదలకు ముందు మూవీ టీమ్ కూడా ఈ కథ కంటే, దాన్ని వాళ్లు ఎలా చెప్పామన్నదే కీలకం అంటూ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చెప్పారు. అందుకు తగ్గట్టే బలమైన పాత్రలు, సంఘర్షణకి వైవిధ్యమైన కథనాన్ని కలిపి సరిగ్గా సరిపోయింది అనిపించేలా ఈ సినిమాను మలిచే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ఏ కథ అయినా సరే అమ్మ నుంచే మొదలవుతుందంటూ అమ్మ, ఆమె తన కొడుకు నుంచి తీసుకున్న మాటతోనే ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆ ఎపిసోడ్‌తోనే సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారో క్లారిటీ వస్తుంది.
స్టోరీ, పాత్రల పరిచయంతో కూడిన ఆరంభ సన్నివేశాలు కాస్త స్లోగా సాగినట్లు అనిపించినప్పటికీ, దయా పాత్ర ఎంట్రీతో అసలు కథ ఊపందుకుంటుంది. సోకులపాలెంని ఓ వస్తువులా చూస్తూ, తనకు వచ్చే కోపాన్ని ఆ ఊరిపై చూపించే ఇన్‌స్పెక్టర్ దయ, అతడికి అన్నతో ఉన్న వైరం ఈ చిత్రంలో కీలకం. ఆరంభం, మలుపు, పీటముడి, మధ్యభాగం, ముగింపు ఇలా పార్శ్వాలుగా కథని చెప్పే ప్రయత్నం చేశారు వివేక్ ఆత్రేయ.
మలుపు అంకం నుంచి సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా సాగుతాయి. ఆ క్రమంలోనే పరిచయమయ్యే చారులత, కూర్మానంద్ పాత్రలు వాటి ద్వారానే ఈ అన్నదమ్ముల మధ్య సంఘర్షణ, సోకులపాలెం కథలు వెలుగులోకి వచ్చే క్రమం ప్రేక్షకుడిని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తాయి.
సూర్య, చారులత లవ్ స్టోరీలో వచ్చే ఈగ కథ అందరినీ నవ్విస్తుంది. సినిమాలో కీలకమైన ప్రతి పాత్ర వెనకా ఓ కథ ఉంటుంది. ఆ కథలను వివరించే క్రమంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించినా, పీటముడి, మధ్యభాగం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సూర్య, చారులత దగ్గరయ్యే సీన్స్, అలాగే చారులతకి సూర్య తన శనివారం సంగతిని చెప్పాలనుకోవడం, ఆ క్రమంలోనే వచ్చే యాక్షన్ సన్నివేశాలు, ఇంటర్వెల్ సీన్స్ మూవీ సెకెండాఫ్‌పై మరిన్ని అంచనాల్ని పెంచాయి.
ఇక అప్పటి నుంచి కథ సూర్య వర్సెస్ దయా అన్నట్టుగా కథ మొత్తం మారిపోతుంది. సోకులపాలెంలో ధైర్యం నింపడం కోసం సూర్య, చారు కలిసి ఓ వ్యూహాన్ని రచించడం, ఆ క్రమంలో అనూహ్యంగా జరిగే ఘటనలు, సూర్య ఇంట్లో సాగే ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కోపం నలుగురిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలంటూ పతాక సన్నివేశాల దిశగా సినిమా సాగుతుంది.
ఎవరెలా చేశారంటే :
నాని యాక్షన్ అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆయన సూర్య పాత్రలో బాగా ఒదిగిపోయారు. ఉద్యోగిగా నేచురల్ లుక్‌తో ఒకవైపు అలరిస్తూనే, మరోవైపు కోపంతో రగిలిపోయే యాంగిల్‌ను చక్కగా చూపించారు. ఎస్.జె.సూర్య పోషించిన ఇన్‌స్పెక్టర్ దయానంద్ పాత్ర సినిమాకి కీలకంగా నిలిచింది. క్రూరత్వం ప్రదర్శిస్తూనే, తన చూపులతోనే భయపెడుతూ విలనిజం పండించారు. ఆ పాత్రకి ఈయన సరైన ఛాయిస్ అని చాటి చెప్పారు.
చారులత పాత్రలో ప్రియాంక మోహన్ నటన ప్రేక్షకులను అలరిస్తుంది. నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పే అంటూ నటుడు మురళీశర్మ తెరపై కనిపించిన తీరు, ఆయన రోల్ ఈ సినిమాలో మరో హైలైట్. ఇక అదితి బాలన్, సాయికుమార్, అభిరామి, హర్షవర్ధన్, అజయ్ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపించి మెప్పిస్తారు.