Salman Khan Threatened: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపింది తామే అంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట ఉన్న ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. 'ఇప్పుడు జరిగింది ట్రైలర్ మాత్రమే. మా బలంమేంటో ఇప్పటికే నీకు తెలిసి ఉంటుంది. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నెక్ట్స్ టైమ్ తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదు. మా టార్గెట్ మీస్ అవ్వదు' అని పోస్ట్‌లో రాసి ఉంది. ఈ పోస్ట్‌కు సంబంధించి స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆదివారం (ఏప్రిల్ 14) ఉదయం సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పులు కలకలం సృష్టించాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ఆయన ఇంటి వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దుండగులు మోటార్ సైకిల్‌పై పరారైనట్లు అక్కడున్న సీసీటీవీ పుటేజీల్లో రికార్డైంది. దీనిపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు. క్రైమ్ బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఇక విచారణ చేపట్టిన ముంబయి పోలీసులు, సల్మాన్ ఖాన్ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న బైక్‌ను స్వాధీనం చేసుకొని ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ బైక్‌ను దుండగులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.