Salman Khan Rs 1 Remuneration Movie : బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ పాపులర్ హీరో సల్మాన్ ఖాన్ గురించి తెలియని వారంటూ ఉంటారు. విభిన్న పాత్రల్లో నటిస్తూ బాలీవుడ్ బాక్సాఫీసును కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్న హీరోల్లో సల్మాన్ ఒకరు. అయితే ఈ స్టార్ హీరో గురించి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత శైలేంద్ర సింగ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. సల్మాన్ ఖాన్‌లోని మానవత్వ కోణం ఆయన ఓ వీడియో ద్వారా పంచుకున్నారు.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ స్టార్ హీరో ఓ సినిమా కోసం కేవలం ఒక్క రూపాయి పారితోషికం మాత్రమే తీసుకున్నారట. అవును మీరు వింటున్నది నిజమే. అప్పటికే బాలీవుడ్లో సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సల్మాన్ హెచ్ఐవీ పాజిటివ్ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నారట. దానికి కేవలం ఒక రూపాయి రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారట.
2004లో వచ్చిన 'ఫిర్ మిలేంగే' సినిమా గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. శైలేంద్ర సింగ్ నిర్మాణంలో, రేవతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హెచ్ఐవీ ఎయిడ్స్ వంటి సున్నితమైన అంశంతో నిండి ఉంటుంది. ఇందులో క్లైమాక్స్‌లో హీరో చనిపోతాడు. వాస్తవానికి ఇలాంటి పాత్రలో నటించేందుకు చాలా మంది స్టార్ హీరోలు సంకోచిస్తారు. అప్పట్లో దాదాపు బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఈ కథను రిజెక్ట్ చేశారట. కానీ సల్మాన్ మాత్రం కథ వినగానే మారు మాట్లాడకుండా పాత్రకు ఓకే చెప్పేశారట. ఇది సల్మాన్ లోని ధైర్యాన్ని బయటపెట్టిందని శైలేంద్ర అన్నారు.