Saif Ali Khan Injured : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ముంబయిలోని తన ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని ఆపేందుకు సైఫ్ యత్నించగా, దుండగుడు ఓ పదునైన ఆయుధంతో సైఫ్‌ను పలుమార్లు పొడిచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అయితే లీలావతి ఆసుపత్రిలో సైఫ్‌కు తాజాగా శస్త్రచికిత్స చేయగా, ఆయనకు ప్రమాదం తప్పినట్లు వైద్యులు ప్రకటించారు.
ఇదీ జరిగింది :
పోలీసులు, సైఫ్ పీఆర్ టీమ్ తెలిపిన వివరాల ప్రకారం. బాంద్రాలోని తన నివాసంలో సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఖాన్, పిల్లలతో కలిసి రాత్రి నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఏదో అలికిడి వినపడింది. దీంతో ఉలిక్కి పడ్డ సైఫ్ అది ఏంటో తెలుసుకునేందుకు సౌండ్ వచ్చిన వైపుకు వెళ్లాడు. ఆ సమయంలోనే ఓ దుండగుడు ఆయన కంట పడ్డాడు. అయితే ఆ అవతలి వ్యక్తి ఎవరా అని చూస్తున్న సమయంలో ఆ దుండగుడు సైఫ్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తికి సైఫ్‌కు చిన్నపాటి ఘర్షణ జరిగింది. అయితే దుండగుడిని నిలవరిస్తున్న సమయంలో అతడు సైఫ్‌ను పలుమార్లు పొడిచి పారిపోయాడు. కత్తిగాట్లకు గురైన సైఫ్‌ను ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.
ఆరు చోట్ల గాయాలు
ఇదిలా ఉండగా, తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో లీలావతి ఆసుపత్రికి చేరుకున్న సైఫ్‌కు ఒంటిపై ఆరుచోట్ల గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే శస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు. నాలుగు చోట్ల కొద్దిగా, అలాగే రెండు చోట్ల లోతుగా గాయమైనట్లుగా లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ముఖ్యంగా వెన్నుముఖకు సమీపంలో గాయాలైనట్లు వివరించారు. అత్యంత పదునైన ఆయుధంతోనే ఈ దాడి జరిగిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.
ఇది దొంగ పనేనా?
మరోవైపు ఓగుర్తుతెలియని వ్యక్తి దొంగతనం చేసేందుకు ఇంట్లోకి చొరబడిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు సైఫ్ అలీఖాన్ పీఆర్ టీమ్ వెల్లడించింది. ఈ విషయంపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీమ్ తెలిపింది. అభిమానులను అలాగే మీడియాను సంయమనం పాటించాలని కోరింది.