Saif Ali Khan Adipurush Movie :రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓంరౌత్ తెరకెక్కిన చిత్రం 'ఆదిపురుష్' . భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. అంతే కాకుండా పలు విషయాల వల్ల విమర్శలను కూడా ఎదుర్కొంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ చిత్రం గురించి స్పందించారు.
'జీవితంలో దృష్టిపెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను వాస్తవంలో బతకాలని అనుకుంటాను. ఓటమి గురించి ఆలోచించను. ఉదాహరణకు 'ఆదిపురుష్' సినిమానే తీసుకుందాం రిస్క్ చేశారని అందరూ అన్నారు. ఎంతోమంది విమర్శించారు. కొత్తగా ప్రయత్నించినపుడు హిట్ కాకపోయినా అధైర్యపడకూడదు. దురదృష్టం కొద్దీ అది విజయం సాధించలేదనుకోవాలి. తర్వాత సినిమాలో రెట్టింపు ఉత్సాహంతో అలరించాలని పని చేయాలి. నేను అలానే చేశాను' అని సైఫ్ అలీఖాన్ అన్నారు.
అయితే ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి విడుదలయ్యే వరకు వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి. పాత్రల వేషధారణ నుంచి సన్నివేశాల్లో ఉపయోగించిన భాష, అలానే చిత్రీకరించిన ప్రదేశాలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం వాటిని అందుకోవటంలో విఫలమైంది. అంతే కాదు ఈ సినిమాపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. మనోభావాలను పట్టించుకోకుండా పురాణాలను అపహాస్యం చేశారంటూ వివిధ హైకోర్టుల్లో కేసులు పెట్టారు. అయితే వాటిని సుప్రీంకోర్టు కొట్టివేసింది.