Sai Pallavi Amaran :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి మనసుని హత్తుకునే పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆమె నటించిన 'అమరన్' చిత్రంలోనూ అలాంటి పాత్రతోనే మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి ఆమె కెరీర్ గురించి మాట్లాడారు. గ్లామరస్ పాత్రలు చేయకపోవడంపై కూడా స్పందించారు. జీవితంలో జరిగిన ఓ సంఘటన తర్వాతే అలాంటి పాత్రలు చేయకూడదనే నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
'ఇండస్ట్రీలోకి సినిమాల్లోకి రాకముందు మెడిసిన్ కోసం జార్జియా వెళ్లాను. అక్కడ టాంగో డ్యాన్స్ నేర్చుకున్నా. ఆ డ్యాన్స్ కోసం స్పెషల్ కాస్ట్యూమ్ ఉంటుంది. అయితే సౌకర్యంగా ఫీలయ్యాకే ఆ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నా. కొంతకాలానికి 'ప్రేమమ్'లో అవకాశం రావడం వల్ల సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమా రిలీజ్ అయ్యాక టాంగో డ్యాన్స్ వీడియోను కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దానికి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ నన్ను చాలా బాధపెట్టాయి. అందుకే సినిమాల్లో శరీరం కనిపించేలా దుస్తులు ధరించకూడదని అప్పుడే డిసైడ్ అయ్యా. ఇక క్రమంగా అది ఒక కండిషన్లాగా మారిపోయింది. దానివల్ల సినిమా అవకాశాలు తగ్గాయా? అంటే చెప్పలేను. కానీ, నా యాక్టింగ్ స్కిల్స్‌పై నమ్మకం ఉంచి వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటున్నా. నాకు నచ్చిన పాత్రలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నా' అని సాయిపల్లవి చెప్పారు.
ప్రేమమ్ కూడా నో
బ్లాక్‌బస్టర్ సినిమా 'ప్రేమమ్'లోనూ ఛాన్స్ వచ్చినప్పుడు సాయి పల్లవి ఒప్పుకోలేదట. అయితే ఆ సినిమా డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రేన్ ఆమె సినిమా చేయాల్సిందేనని పట్టు పట్టారట. దీంతో సాయి పల్లవి 'ప్రేమమ్'లో నటించడానికి అంగీకరించారట. 2015లో రిలీజైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. నివీన్ పౌలీ ఈ సినిమాలో హీరోగా నటించగా, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ కీలక పాత్రలు పోషించారు.