Rashmika Flight Emergency Landing :నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. రీసెంట్గా యానిమల్ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడినట్లు రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే. రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. నాగాశౌర్య నటించిన ఛలో చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత గీతా గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్, భీష్మ, సరిలేరు నీకెవ్వరూ వంటి వరుస చిత్రాలతో మంచి సక్సెస్‌లను అందుకుంది. ఇక అల్లు అర్జున్ పుష్పతో నేషనల్ క్రష్ అయిపోయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే.
బాలీవుడ్‌లోనూ మొదట మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు చేసి ఆకట్టుకోలేకపోయినా ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రీసెంట్గా సందీప్ వంగా దర్శకత్వంలో యానిమల్ చేసి భారీ సక్సెస్‌ను అందుకుంది. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది. దీంతో ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే షూటింగ్లలో బిజీగా ఉంటున్న ఈ భామ తాజాగా ముంబయి నుంచి హైదరాబాద్‌కు విమానంలో బయలు దేరింది. ఇందులో మరో నటి శ్రద్ధా దాస్ కూడా ఉంది.