Ramya Krishna Photoshoot :సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. పొగరున్న పట్నం పిల్లగా, కన్నీళ్లు పెట్టించే కూతురిగా, మత్తెక్కించే ఐటెం గర్ల్‌గా, హీరో, హీరోయిన్లకు అమ్మగా, అత్తగా కూడా ఎన్నో పాత్రలు చేసి అభిమానుల మదిలో స్థానం సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆమె సినిమాలు చేసింది. కెరీర్లో దాదాపుగా 260కుపైగా సినిమాల్లో నటించి మెప్పించింది.
రమ్యకృష్ణ మొదట తన 14వ ఏటనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 1984లో తమిళంలో వేల్లై మనసు, తెలుగులో భలే మిత్రులు చిత్రాలతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు మొదట ఆశించిన స్థాయిలో హీరోయిన్‌గా గుర్తింపు రాలేదు. దాదాపు ఐదేళ్ల పాటు సక్సెస్ లేకుండానే ఇండస్ట్రీలో రాణించింది. సైడ్ క్యారెక్టర్లు కూడా చేసింది. అయితే కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులుతో తొలి హిట్‌ను అందుకుంది. అందులో తన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత కె. రాఘవేంద్రరావుతో చేసిన అల్లుడుగారు, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు సినిమాలతో రొమాంటిక్ హీరోయిన్ అయిపోయింది. అనంతరం ఎన్నో హిట్ చిత్రాల్లో ప్రియురాలిగా, భార్యగా, హై క్లాస్ భామగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్‌లను దక్కించుకుంది.