Double Ismart Review:సినిమా: డబుల్ ఇస్మార్ట్; నటీనటులు: రామ్, సంజయ్ దత్, కావ్య థాపర్, సాయాజీ షిండే, గెటప్ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్ తదితరులు; దర్శకత్వం: పూరి జగన్నాథ్; సంగీతం: మణిశర్మ; సినిమాటోగ్రఫీ: జియానీ, శ్యామ్ కె.నాయుడు; ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్; నిర్మాత: పూరి జగన్నాథ్, ఛార్మి; రచన, విడుదల: 15-08-2024
ఉస్తాద్ రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. తొలి భాగం హిట్ అవ్వడం వల్ల సీక్వెల్‌పై భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, పూరికి డబుల్ ఇస్మార్ట్ విజయాన్ని ఇచ్చిందా?
కథేంటంటే: బిగ్ బుల్ (సంజయ్‌దత్) విదేశాల్లో విలాసాలతో జీవిస్తూ చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. భారతదేశాన్ని ముక్కలు చేయాలనేది అతడి కల. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'రా' అతడి కోసం వెతుకుతుంటుంది. ఇంతలో బిగ్‌బుల్ మెదడులో కణితి ఉందని, దాని ప్రభావంతో కొన్ని నెలలు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు చెబుతారు. మరో వందేళ్ల ప్రణాళికలతో బతుకుతున్న బిగ్ బుల్ తాను ఎలాగైనా బతకాలనుకుంటాడు.
అందుకోసం ఆలోచిస్తుండగా మెదడులో చిప్ పెట్టుకుని హైదరాబాద్‌లో జీవిస్తున్న ఒకే ఒక్కడు ఇస్మార్ట్ శంకర్ (రామ్) పేరు తెరపైకొస్తుంది. బిగ్ బుల్ మెమొరీస్ అన్నీ కాపీ చేసి, ఇస్మార్ట్ శంకర్ మెదడులోని చిప్‌లో పేస్ట్ చేస్తారు. దాంతో శరీరం ఇస్మార్ట్ శంకర్‌ది అయినా, ఆలోచనలన్నీ బిగ్ బుల్‌వే కాబట్టి అతనికి మరణం ఉండదనేది వాళ్ల ప్లాన్. మరి ఇస్టార్ట్ శంకర్‌లోకి బిగ్ బుల్ ఆలోచనలు వచ్చాక ఏం జరిగింది? ఇస్మార్ట్ ఎలాంటి లక్ష్యంతో ఉంటాడు? అతడి సొంత జ్ఞాపకాలు, అతని ప్రేమ, లక్ష్యాలు ఏమయ్యాయి? అవన్నీ తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే: 'ఇస్మార్ట్ శంకర్' సినిమా సీక్వెల్‌కు తగ్గట్లుగానే పూరి కథ సిద్ధం చేసుకున్నారు. ఒక మనిషి మెదడులోకి మరో వ్యక్తి వస్తే ఎలా అనే కాన్‌ఫ్లిక్ట్ తొలి సినిమాకి దీటుగానే అనిపిస్తుంది. మరోవైపు ఇస్మార్ట్ పాత్రకు బ్రాండ్‌గా మారిపోయిన రామ్ ఉండనే ఉన్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఎక్కువ జాగ్రత్తపడ్డారో లేక, తన పాత సినిమాల్ని గుర్తు చేయాలనుకున్నాడో తెలియదు. సినిమాలో లాగింగ్ ఎక్కువైంది.
తన శైలి వేగం, పదును లేని కథనంతో చాలా వరకు సినిమా స్లోగా సాగుతున్న ఫీల్ కలుగుతుంది. అలీ కామెడీ కూడా వరౌట్ కాలేదు. దీంతో సినిమా ఏ దశలోనూ ఆసక్తిగా మారదు. పోశమ్మ కథని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ ఎపిసోడ్‌తోనే హీరో ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడని అర్థమైపోతుంది. తొలి సన్నివేశంలోనే దాదాపుగా కథ రివీల్ అయిపోయి చాలాసేపు అక్కడే ఆగిపోతుంది.
తెరపై పాత్రలు పరిచయం అవుతుంటాయి. సీన్స్ సాగిపోతాయి కానీ, ఆడియోన్స్‌కు ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. హీరో రామ్ తన నటన, హీరోయిన్‌తో కలిసి చేసే అల్లరే కాస్త ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో మలుపులేమైనా ఉంటాయేమోనని ఎదురు చూస్తే అక్కడా నిరాశే. హీరో ఎందుకు ప్రతీకారంతో రగిలిపోతుంటాడో, బిగ్ బుల్ ఇండియా రాక వెనక ఎవరున్నారో రివీల్ అయ్యే అంశాలు తప్ప మరేదీ ఆకట్టుకోదు! మెమొరీ కాపీ, పేస్ట్ అంటూ కథ సాగిన తీరు అక్కడక్కడ అపరిచితుడు పాత్రని గుర్తు చేస్తుంది.