Game Changer Event Pavan Kalyan :గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించనున్నానని టీఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆ ఈవెంట్ చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్‌ని కోరారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఏర్పాటైన 256 అడుగుల రామ్ చరణ్ (గేమ్ ఛేంజర్ లుక్) కటౌట్‌ను లాంచ్ చేసి, అనంతరం మాట్లాడారు.
"గేమ్ ఛేంజర్ ట్రైలర్ నా ఫోన్‌లో ఉంది. మీకు చూపించాలంటే మేం ఇంకా వర్క్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ట్రైలరే సినిమా రేంజ్‌ని నిర్ణయిస్తుంది. జనవరి 1న ట్రైలర్ వస్తుంది. తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ. 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్ పెట్టడంతో ఇక్కడ మరో రికార్డు నెలకొంది. మెగా అభిమానులందరికీ ధన్యవాదాలు. మీరు మామూలు ఫ్యాన్స్ కాదు. సుప్రీం హీరో చిరంజీవితో మొదలైన మీ అభిమానం ఇప్పటికీ వారి కుటుంబంపై కొనసాగుతోంది. ఒక్కరే బాస్ (చిరంజీవి). ఆయనే మెగాస్టార్. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. మనకు పవర్ స్టార్ (పవన్ కల్యాణ్), మెగా పవర్‌స్టార్ (రామ్ చరణ్)ను అందించారు. వీరితోపాటు అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, సాయి దుర్గా తేజ్ తదితరులను ఇచ్చారు"
"ఈవెంట్‌తోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు ఇక్కడకు వచ్చా (నవ్వుతూ). అమెరికాలో ఈవెంట్ చేశాం. అది గ్రాండ్ సక్సెస్. మరి, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో వేడుక చేస్తే ఎలా ఉంటుంది? దాని గురించి మాట్లాడడానికి వచ్చా. పవన్ కల్యాణ్ గారు చెప్పే డేట్‌ని బట్టి ఈవెంట్ ఎక్కడ చేయాలో నిర్ణయిస్తాం. మనం ఆ ఈవెంట్‌తో చరిత్ర సృష్టించాలి అని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. విజయవాడకు బయలుదేరే ముందు చిరంజీవికి ఫోన్ చేసి సర్ సినిమా సిద్ధమైంది. మీరు మళ్లీ ఫైనల్ వెర్షన్ చూడాలని చెప్పా. పంపించు చూస్తానన్నారు. నేను ఇటు వస్తుంటే ఆయన మూవీ చూడడం ప్రారంభించారు. ఆయన స్పందన ఎలా ఉంటుందో అనుకుంటూనే ఉన్నా. ఈ వేదికకు చేరుకోగానే ఆయన్ను నుంచి కాల్ వచ్చింది. సంక్రాంతికి మనం మామూలు హిట్ కొట్టడంలేదని అభిమానులకు చెప్పు’ అని అన్నారు. మీరంతా జనవరి 10న రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు. ఐఏఎస్ ఆఫీసర్‌గా, కొంతసేపు పోలీస్ ఆఫీసర్‌గా అలరిస్తారు. 5 పాటలు దేనికదే ప్రత్యేకం. రన్‌టైమ్ గురించి శంకర్‌కు ముందే చెప్పా. అన్ని హంగులు జోడిస్తూ 2 గంటల 45 నిమిషాల్లో ఆయన చక్కగా తీర్చిదిద్దారు" అని తెలిపారు.
ఇంటర్నేషనల్ వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న 50వ చిత్రమిది. విడుదల సమయం దగ్గరపడుతుండడంతో ఫ్యాన్స్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. హెలికాప్టర్‌లో నుంచి పూల వర్షం కురిపించారు. ఆ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. రికార్డు సంస్థ ప్రతినిధుల నుంచి దిల్ రాజు అవార్డు అందుకున్నారు.