Pushpa 2 Show Cancelled :ఐకాన్ స్టార్ 'పుష్ప 2' సినిమాకు నార్త్‌లో భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. సినిమా రిలీజై 25 రోజులు కావస్తున్నా, హిందీ బెల్ట్‌లో పుష్ప రాజ్ యాక్షన్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే హిందీలో ఈ సినిమా రూ.700 కోట్ల వసూళ్లు సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే పుష్ప సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు షాక్ తగిలింది. పుష్ప సినిమాకు బదులుగా మరో చిత్రాన్ని ప్రదర్శించి అదే చూడాలంటూ బలవంతం చేశారట. దీంతో అగ్రహించిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.
అసలేం జరిగిందంటే?
ఈ సంఘటన రాజస్థాన్ జైపుర్‌లోని ఓ థియేటర్లో జరిగింది. ఆన్‌లైన్‌లో ఈ నెల 25న 'పుష్ప 2'కి టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్తే, స్క్రీన్ పై 'బేబీ జాన్' సినిమా వేయడంతో ఒక్కసారిగా షాకయ్యారట. తాము టికెట్ బుక్ చేసుకుంది 'పుష్ప 2' సినిమా కోసం అని, బేబీ జాన్ మూవీ తమకు వద్దంటే వద్దని ప్రేక్షకులు హాలులోనే హంగామా చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా సినిమా మార్చేయడం పట్ల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఇక చేసేదేమీ లేక కొందరు సినిమా చూస్తే, మరికొందరు మాత్రం తమకు షో మార్పుపై బుకింగ్ యాప్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని, రిఫండ్ కావాల్సిందేనని డిమాండ్ చేశారు.
'ఈ థియేటర్లో ఆన్‌లైన్‌లో 'పుష్ప 2' సినిమా ఉన్నట్లు చూపిస్తుంది. కానీ, పుష్ప క్యాన్సిల్ చేసి వేరే సినిమా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ థియేటర్లో పుష్ప సినిమానే ఉన్నట్లు బుక్ మై షో యాప్‌లో చూపిస్తోంది. మేము కూడా పుష్ప సినిమాకు టికెట్ బుక్ చేసుకున్నాం. మా టికెట్లు కన్ఫార్మ్ అయ్యాయి. కానీ, ఇక్కడకు వస్తే, వేరే సినిమా వేస్తున్నారు. అదే చూడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బుకింగ్ యాప్‌లో ఎలాంటి క్యాన్సిల్ మెజేజ్ కూడా రాలేదు' అంటూ ప్రేక్షకులు వాపోయారు.