Premalu Heroine Mamitha Baiju Pranaya vilasam :ఈ ఏడాది సూపర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది మలయాళ సినిమా ప్రేమలు. అలానే ఈ మూవీలో హీరోయిన్గా చేసిన మమిత బైజు ప్రస్తుతం యూత్ క్రష్ లిస్ట్‌లోకి చేరిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమెనే కనపడుతోంది. అందరూ ఈమె అందానికి ఫిదా అయిపోతున్నారు. దీంతో చాలా మంది కుర్రాళ్లు, ఆడియెన్స్ ఈమె నటించిన గత సినిమాల గురించి కూడా తెగ సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు. దీంతో ఆమె నటించిన పాత చిత్రాల జాబితా వివరాలు బయట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలోనే మమిత 2023లో ప్రధాన పాత్రలో నటించిన ప్రణయ విలాసం సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ఈటీవీ విన్. ఈ చిత్రం మలయాళంలో మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీనే ఇక్కడి ఆడియెన్స్ తెలుగు డబ్బింగ్తతో ఈటీవీ విన్లో విడుదల చేయనున్నారు. "మొదటి ప్రేమ అందరి జీవితాలలోని సజీవమే అదెప్పుడు రొమాంటిక్‌గా ఉంటుంది" అంటూ ఈటీవీ విన్ ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీ మే 2 అని ప్రకటించింది.
ఈ చిత్రంలో అర్జున్ అశోకన్ సరసన మమిత బైజు నటించింది. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ప్రేమ చాలా విలువైనది, ప్రత్యేకమైనది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. వయసులో ఉన్నవారికే కాదు మధ్య వయసు వారిలో కూడా తొలి ప్రేమ తాలూకు అందమైన అనుభవాలు జీవితాంతం గుర్తుంటాయి అని ఇందులో సందేశం ఉంటుంది.