Prasanth Varma About PVCU : 'హనుమాన్'తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆ మూవీ సీక్వెల్‌ను తెరకెక్కించే పనుల్లో ఉన్నారు. అయితే తాజాగా ఆయన లైనప్‌లో ఉన్న మరిన్ని సినిమాల గురించి ఓ ఆంగ్ల మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇందులో భాగంగా 'జై హనుమాన్' రిలీజ్ డేట్, అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) గురించి కూడా ఆయన మాట్లాడారు.
"PVCU కోసం నేను కొంతమంది బాలీవుడ్ స్టార్స్‌ను సంప్రదించాను. వారందరితో నా ఐడియాలను షేర్ చేసుకున్నాను. వారు ఈ యూనివర్స్‌లో కచ్చితంగా భాగమవుతారు. అయితే దానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే ఈ సినిమాటిక్ యూనివర్స్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇక 'జై హనుమాన్' సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'హనుమాన్' రూ.100 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసుంటే మేము ఆ మూవీ సీక్వెల్‌ను ఎప్పుడో విడుదల చేసేవాళ్లం. కానీ ఆ చిత్రం మా అంచనాలకు మించి కలెక్షన్లు సాధించింది. అందుకే మా బాధ్యత కూడా మరింత పెరిగింది" అని తన అప్‌కమింగ్ సీక్వెల్ మూవీ గురించి ప్రశాంత్ చెప్పుకొచ్చారు.
జై హనుమాన్‌కు ముందే మరో చిత్రం
ఇక ఇదే వేదికగా తన లైనప్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కంటే ముందు 'అధీరా' అనే మరో సినిమాను రిలీజ్ చేయనున్నారని అన్నారు. దీంతో పాటు మరో రెండు సినిమాలకు కూడా పనిచేస్తున్నామని తెలిపారు.