Prabhas Hanu Raghavapudi Movie Shooting : 'కల్కి 2898 AD'తో భారీ సక్సెస్ అందుకున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో ఉన్నారు. షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు మారుతీ రాజాసాబ్ చిత్రాన్ని పూర్తి హారర్ ఎంటర్‌టైనర్ సినిమాగా తెరకెక్కిస్తుండగా ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ సినిమా చేయనున్నారు. రీసెంట్‌గానే పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయిన ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.
అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చే వారం నుంచే 'ఫౌజీ' షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. సినిమా షూటింగులో భాగంగా ఫస్ట్ షెడ్యూల్‌ను తమిళనాడులోని కారైకుడిలో పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలను తమిళనాడులోని కారైకుడి ప్యాలెస్‌లో చిత్రీకరించబోతున్నారట. ఈ షెడ్యూల్ అంతా ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతాయని తెలుస్తుండగా, సెకండ్ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకమైన సెట్స్ కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం. అయితే దీని గురించి చిత్ర యూనిట్ త్వరలో మరిన్ని వివరాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
దర్శకుడు హను ఈ చిత్రాన్ని రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. స్ట్రాంగెస్ట్ ఎమోషనల్ లవ్ డ్రామా యాంగిల్‌తో పాటు సుభాష్ చంద్రబోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి ఈ సినిమాలో చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.