Pawan Kalyan About OG Movie :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న 'ఓజీ'పై ఫ్యాన్స్‌కు రోజురోజుకు ఆత్రుత పెరిగిపోతుంది. అందుకే పవన్ ఏ మీటింగ్, ఈవెంట్‌కు వెళ్లినా అభిమానులు ఓజీ, ఓజీ అని అరవడం మాములు అయిపోయింది. ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్ మినహా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. అయితే పవర్ స్టార్ స్వయంగా దీనిపై మాట్లాడారు. తాజాగా నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఓడీ సినిమా సంగతులు షేర్ చేసుకున్నారు.
'ఓజీ 1980- 90ల మధ్య జరిగే కథ. OG అంటే 'ఒరిజినల్ గ్యాంగ్ స్టర్'. నేను ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్ 'OG, OG' అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకున్న అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చాను. అయితే వాళ్లే సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. నా సినిమాల్లో ఒకటైన 'హరిహర వీరమల్లు' కేవలం మరో ఎనిమిది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఒక దాని తర్వాత ఒకటి అన్ని సినిమాలు పూర్తి చేస్తాను' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇక సినిమా మేకింగ్‌పై కూడా పవన్ మాట్లాడారు. ఇండస్ట్రీలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. 'సినిమా పరిశ్రమలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీలోని వారందరూ కూర్చొని మాట్లాడాలి. రాష్ట్రంలో పాపికొండలు వంటి చక్కటి లొకేషన్లు ఉన్నాయి. విజయనగరం అటవీ ప్రాంతంలోనూ అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అవసరం. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలి. స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలి. అప్పుడే మంచి సినిమాలు సాధ్యం' అని అన్నారు.