Most Viewed Web Series In India 2024 : పేరుకు హిందీ సిరీస్ అయినా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది 'మీర్జాపూర్ 3'. 2024లో వచ్చిన ఈ సిరీస్ ఆ ఏడాది అత్యధికంగా వీక్షించిన కంటెంట్‌గా రికార్డు సృష్టించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌ను దాదాపు 30.8 మిలియన్ల మంది చూశారని ఓ సర్వేలో తేలింది. ఓటీటీ కంటెంట్‌ను విశ్లేషించే ఆర్‌మ్యాక్స్ మీడియా తాజా తమ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, వివిధ ఓటీటీ వేదికల్లో అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలకు సంబంధించిన వివరాలనూ ఆ సంస్థ వెల్లడించింది. అవేంటో చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకుని అనతికాలంలోనే పాపులర్ అయిన వెబ్‌సిరీస్‌ల్లో 'స్క్విడ్ గేమ్2' ఒకటి. 2024 డిసెంబర్లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చిన కొద్ది రోజుల్లోనే రికార్డులు తిరగరాసింది. ఇప్పటివరకూ 'మనీ హెయిస్ట్' పేరిట ఉన్న వ్యూవర్షిప్ను దాటేసింది. అంతేకాకుండా భారత్‌లోనూ ఈ సిరీస్ బాగానే పాపులర్ అయ్యిందని ఆర్‌మ్యాక్స్ తమ నివేదికలో తెలిపింది.
ఇండియాలో ఆ వెబ్‌సిరీస్‌లదే హవా!
భారతీయ ఓటీటీ ఇండస్ట్రీలో ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల హవా కొనసాగుతోంది. ఎంతలా అంటే టాప్-15 ఒరిజినల్ సిరీస్లుఈ వేదికలగానే స్ట్రీమింగ్ అవుతూ అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో 'మీర్జాపూర్ 3' తర్వాత అత్యధికంగా 'పంచాయత్3' సిరీస్‌ను ప్రజలు వీక్షించినట్లు తెలుస్తోంది. 28.2 మిలియన్ల మంది 'పంచాయత్ 3'ని ఆదరించారు. ఈ రెండింటి తర్వాత 21.5 మిలియన్ వ్యూవర్స్‌తో 'హీరామండి: ది డైమండ్ బజార్' మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇదిలా ఉండగా, నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాల్లో టాప్-15లో 11 చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చినవే కావటం విశేషం. వీటిలో 'దోపత్తి'(15.1 మిలియన్), 'సెక్టార్ 36' (13.9మిలియన్) 'సికిందర్ కా ముకద్దార్' (13.5మిలియన్) ఉన్నాయి.