NTR 101 Birth Anniversary : సీనియర్ ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో ఓ దర్శకుడు, నిర్మాత, రచయిత కూడా ఉన్నారు. అయితే నటుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన తన సినీ జీవితంలో దాదాపుగా 93 మంది దర్శకులతో పని చేశారు. ఎంతో మంది కొత్త దర్శకులకు కూడా అవకాశం ఇచ్చి ప్రతిభను పోత్సాహించారు.
స్వీయదర్శకత్వంలోనే ఎక్కువ! -ఎంతో మంది దర్శకులతో పని చేసిన ఎన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలోనూ నటించారు. దాదాపు 17 సినిమాల వరకు చేశారు. అలా తనను ఎక్కువ సినిమాల్లో డైరెక్ట్ చేసిన రికార్డ్‌ను తన పేరు మీదే రాసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు అత్యంత ఆత్మీయులు అయిన సి.ఎస్. రావు, డి. యోగానంద్ ఆయనతో చెరో 16 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
పౌరాణిక బ్రహ్మతో 15, జానపద బ్రహ్మతో 13! - ఎన్టీఆర్ హీరోగా 15 చిత్రాలు చేశారు కామేశ్వర రావు. వాటిలో ఎక్కువగా పౌరాణిక చిత్రాలే ఉండటం విశేషం. ఇక, జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ 13 చిత్రాల్లో నటించారట.
ఆయనతో 10 - ఈ ఇద్దరితో చెరో 9 - దర్శకుడు కేవీ రెడ్డితో కలిసి పది చిత్రాలు చేశారు ఎన్టీఆర్. అందులో 'శ్రీకృష్ణ సత్య' ఒకటి. ఇక ఎన్టీఆర్‌ను సినిమాకు పరిచయం చేసిన వ్యక్తి ఎల్వీ ప్రసాద్. వీరిద్దరి కలయికలో 9 చిత్రాలు వచ్చాయి. ఇక తనను హీరోగా చేసిన బి.వి. సుబ్బారావు దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ తొమ్మిది సినిమాల్లో నటించారు.