Netflix Movies OTT : ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఎంటర్టైన్ మెంట్‌కు కొదువే లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతి వారం కొత్త కథలు, భిన్నమైన పాత్రలతో థియేటర్లు, ఓటీటీల వేదికగా ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. మరోవైపు నటీనటులు సైతం వేదికేదైనా సరే ప్రేక్షకుల్ని అలరించడమే లక్ష్యంగా ముందుకొస్తుంటారు. ఇప్పుడు ఈ బాటలోనే పలువురు తారలు వైవిధ్యమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో ఓటీటీ వేదికగా సందడి చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ ప్రాజెక్టుల టీజర్లను రిలీజ్ చేసింది. అవేంటో ఓ సారి చూద్దాం.
రానా నాయుడు-2
"రానాను ఆపగలిగేది అతని తండ్రి మాత్రమే" అంటూ 'రానా నాయుడు' మరోసారి సిద్ధమయ్యారు. యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో రూపొంది 'రానా నాయుడు' వెబ్ సిరీస్ సక్సెస్ సాధించింది. టాలీవుడ్ హీరోలు వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఎన్నో విమర్శలు ఎదురైనా సరే ఓటీటీ వేదికగా సత్తా చాటి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'రానా నాయుడు-2' రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇన్‌స్టా వేదికగా టీజర్‌ను రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. 'ఇప్పుడు విధ్వంసం మొదలవబోతుంది మామ. ఎందుకంటే ఇది రానా నాయుడు స్టైల్' అనే క్యాప్షన్ జోడించింది. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
దొంగగా సైఫ్
ఏ పాత్రలోనైనా సునాయాశంగా ఒదిగిపోయే నటుల్లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఒకరు. ఈ సారి ఆయన ఓ దొంగగా కనిపించనున్నారు. కూకీ గలాటీ, రాబీ గ్రేవాల్ తెరకెక్కిస్తున్న 'జ్యువెల్ థీఫ్'లో ఆయన నటిస్తున్నారు. జైదీప్ అహ్లావత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా చిత్రబృందం రిలీజ్ చేసింది. ఒక అమూల్యమైన వజ్రాన్ని దోపిడి చేయడానికి సైఫ్ చేస్తున్న ప్రయత్నాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది ఈ టీజర్.
అక్కగా కీర్తి సురేశ్
ఇటీవలే తన ప్రియుడిని పెళ్లాడిన కీర్తి సురేశ్ త్వరలో 'అక్క'గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. కీర్తి, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ను ధర్మరాజ్ శెట్టి రూపొందించారు. తాజాగా ఈ సిరీస్‌ను అధికారికంగా ప్రకటిస్తూ టీజర్‌ను విడుదల చేశారు. "ఒక తిరుగుబాటుదారుడు పతనానికి కుట్ర పన్నాడు. పెర్నేరుకు చెందిన ఓ అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. వేచి ఉండండి 'అక్క' త్వరలో వస్తోంది" అని వ్యాఖ్యల్ని జోడించింది. రివేంజ్ డ్రామాగా ఈ సిరీస్‌లో తెరకెక్కినట్లు తెలుస్తోంది. కీర్తి సురేశ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనువిందు చేయనున్నట్లు టీజర్ తో అర్థమవుతోంది.