Nagarjuna Naa Saami Ranga OTT : ఈ వీకెండ్ వచ్చేసింది. దీంతో మిమ్మల్ని ఇంటికొచ్చి మరీ అలరించేందుకు రెడీ అయిపోయారు కింగ్ నాగార్జున. ఆయన రీసెంట్గా నటించిన సంక్రాంతి బ్లాక్ బాస్టర్ నా సామిరంగ ఓటీటీలోకి వచ్చేసింది. చివరిగా బంగార్రాజు చిత్రంతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలు ఆడకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని ఆచితూచి మరీ నా సామి రంగతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తనకు అచ్చొచ్చిన సంక్రాంతి పండగ బరిలోనే దిగి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గుంటూరు కారం, సైంధవ్ వంటి చిత్రాలతో గట్టి పోటీ ఎదురైనప్పటికీ అంచనాలకు తగ్గట్టే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్ అభిమానులను బాగా అలరించింది.
అయితే సంక్రాంతి చిత్రాలు రిలీజై నెల రోజులు అయిన సందర్భంగా ఒక్కొక్కటిగా అవి డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే గుంటూరు కారం, సైంధవ్ స్ట్రీమింగ్ అవుతుండగా హనుమాన్ స్టీమింగ్కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నా సామి రంగ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిస్నీ+ హాట్‍స్టార్ వేదికగా ఫిబ్రవరి 17న అర్థ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ చిత్రం పరింజు మరియం జోస్‍కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి సినిమాను థియేటర్లలోకి వదిలారు. చిత్రంలో నాగార్జున సరసన అషికా రంగనాథ్, అల్లరి నరేశ్ సరసన మిర్నా మీనన్, రాజ్ తరుణ్‍కు జోడీగా రుక్సార్ థిల్లాన్ జంటగా నటించారు. ఇంకా నాజర్, రవివర్మ, షబ్బీర్ కల్లరకల్, మధుసూదన్ రావు, రావు రమేశ్ సహా తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మ్యాజిక్ అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి సినిమాను నిర్మించారు. ప్రసన్న కుమార్ బెజవాడ సినిమాకు మాటలను అందించారు.