Naga Chaitanya Sobhita Dhulipala Engagement : టాలీవుడ్ హీరో నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం(ఆగస్ట్ 8) జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో హీరో నాగార్జున పంచుకున్నారు. దీంతో సీక్రెట్ రిలేషన్షిప్ మెయిన్‌టెయిన్ చేసిన నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వీరిద్దరూ మధ్య ప్రేమ ఎలా, ఎక్కడ చిగురించిందని తెలుసుకునేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు.
ఫొటోలు లీక్ - నాగ చైతన్య, శోభిత రిలేషన్ గురించి గతంలోనే ప్రచారం సాగింది. వారిద్దరూ కలిసి బయటికి వెళ్లినప్పుడు కొన్ని ఫోటోలు లీక్ కావడంతో ఈ జంట రిలేషన్ షిప్లో ఉన్నారని నెటిజన్లు భావించారు. అలాగే పలు వేదికలపై నాగచైతన్య, శోభిత కలిసి కనిపించడంపై ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని చాలా మంది భావించారు. అయితే తమ రిలేషన్ పై నాగచైతన్య కానీ, శోభితకానీ ఎవరూ స్పందించలేదు. తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ వారిద్దరి హాలీడే ట్రిప్ ఫొటోలు చైతన్య, శోభిత మధ్య బంధాన్ని ప్రపంచానికి తెలియజేశాయి.
ప్రేమ కథ ఎప్పుడు మొదలైందంటే? - సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత శోభితతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. 2023 సెప్టెంబరులో శోభిత తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ బుక్ ఫొటోను పోస్ట్ చేశారు. అలాగే నాగచైతన్య ప్రొఫైల్‌లో కూడా ఇదే ఫొటో ఉంది. దీంతో నాగచైతన్య, శోభిత మధ్య ప్రేమ నడుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. చైతన్య శోభితకు ఈ బుక్‌ను ప్రిఫర్ చేశారని కామెంట్లు వచ్చాయి.
ఆ తర్వాత చైతూ - శోభిత హాలీడే ట్రిప్‌కు వెళ్లిన ఫొటోస్ సోషల్ మీడియాలో దర్శనమయ్యాయి. లండన్ గేట్ వే, యూరప్ పర్యటన ఇలా చాలా సార్లు నాగచైతన్య పక్కన శోభిత కనిపించారు. దీంతో వీరి బంధం గురించి చర్చ మరింత ఎక్కువైంది. ముఖ్యంగా లండన్ గేట్ వే ట్రిప్‌లో ఓ ఫొటో బాగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పిక్‌ను ఇండియన్ చెఫ్ షేర్ చేశారు. ఇందులో చైతూ, శోభిత కలిసి కనిపించడం అందర్నీ షాక్‌కు గురి చేసింది.
ఇక నాగచైతన్యతో పాటు శోభిత కూడా జంగిల్ సఫారీ టూర్ ఫొటోలను షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి ఫొటోల్లో ఒకే లోకేషన్, బ్యాక్ డ్రాప్ కనిపించింది. దీంతో నాగచైతన్య, శోభిత ఇద్దరు కలిసే టూర్‌కు వెళ్లినట్లు కన్ఫామ్ అయింది. అలా వీరి ప్రేమ కథ నడిచింది.