Chiranjeevi Guinness Record:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీఇండస్ట్రీలో రికార్డులకు కేరాఫ్ ఆడ్రస్. సినిమాలకు పదేళ్లు దూరంగా ఉన్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గని స్టార్ చిరంజీవి. సినీరంగంలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటనకుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. ఈ సందర్భంగా చిరంజీవి అవార్డులు, రికార్డులు, సేవా కార్యక్రమాలపై ఓ లుక్కేద్దాం.
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొణిదెల శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి. అలా మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు 'పునాదిరాళ్లు' సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత వెనక్కితిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే 'నటన అంటే కమల్ హాసన్, స్టైల్ అంటే రజనీకాంత్ ఈ రెండూ ఉన్న కథానాయకుడు మెగాస్టార్!' అనేంతలా ఎదిగారు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ లక్షలాదిమంది ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. 90ల్లో డ్యాన్స్ అంటే చిరంజీవిదే. సినిమాల్లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆడియెన్స్‌ను అలరించేవారు. యాక్షన్ సీన్స్‌తో మాస్ ప్రేక్షకుల్ని కూడా తనవైపు తిప్పుకున్నారు. ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లో తనదైన మార్క్ చూపించి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
రికార్డులు: 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'రౌడీ అల్లుడు', 'గ్యాంగ్ లీడర్' వంచి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ పెంచారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ అనేక రికార్డులు సృష్టించారు. 'ఇంద్ర', 'ఠాగూర్', 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్', 'స్టాలిన్' సినిమాలతో సంచలన విజయాల్ని అందుకున్నారు. ఇక 2007 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.
సెకండ్ హాఫ్లోనూ జోరు:దాదాపు 10ఏళ్ల తర్వాత మెగాస్టార్ 'ఖైదీ నెం.150' సినిమాతో బిగ్ స్క్రీన్‌పై సందడి చేశారు. రీఎంట్రీలో తొలి సినిమాతోనే పలు రికార్డులు బద్దలుకొట్టి, ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆ తర్వాత 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ ఫాదర్', 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్'తో సెకండ్ హాఫ్లోనూ జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' చేస్తున్నారు.
అవార్డులు: మెగాస్టార్ చిరంజీవిని 2006లో అప్పటి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ని కూడా అందుకున్నారు. 2016లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. 'స్వయం కృషి', 'ఆపద్బాంధవుడు', 'ఇంద్ర' సినిమాలకుగానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఇక 2022లో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా దక్కింది. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభుషణ్ అవార్డుతో సత్కరించింది.
సేవా కార్యక్రమాలు: సినిమాల్లోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి మెగాస్టారే! ఆయన మదర్ థెరిస్సా స్ఫూర్తితో 1998లో చిరంజీవి ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం సేవలు అందించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ చిత్రపరిశ్మమ కార్మికుల్ని ఆదుకోవడం కోసం సీసీసీ సంస్థను ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు.