Committee Kurrollu Chiranjeevi:మెగా డాటర్ నిహారికా కొనిదెల సమర్పణలో రూపొందిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా ఆగస్టు 9న రిలీజై సూపర్ రెస్పాన్స్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. చిన్న సినిమాగా రిలీజైన 'కమిటీ కుర్రోళ్లు' పెద్ద విజయం అందుకొని అందరి ప్రశంసలు పొందుతుంది. ఈ సినిమా సక్సెస్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినిమాలో నటించిన నటులందరూ కథాకు అనుగుణంగా మేకోవర్ అవ్వడమే కాకుండా, చక్కగా వారి పాత్రల్లో ఒదిగిపోయారని చిరంజీవి అన్నారు. అలాగే మూవీటీమ్ను ఇంటికి పిలిచి మరీ అభినందించారు.
''కమిటీ కుర్రోళ్ళు' సినిమా చూశా. చిత్రం అద్భుతంగా ఉంది. అందరూ కొత్త కుర్రాళ్లే. చాలా బాగా నటించారు. సినిమా చూస్తున్నప్పుడు కొత్తవాళ్లు నటిస్తున్నారనే విషయం మర్చిపోయా. ఎమోషనల్ సీన్స్ చాలా చక్కగా పండాయి. నటీనటులందరూ కథానుగుణంగా మేకోవర్ అయిన తీరు అద్భుతం. సినిమాను నేచురల్‌గా చిత్రీకరించటం కోసం మొత్తం టీమ్ పడిన కష్టం తెరపై కనిపించింది. బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు యదువంశీకి ప్రత్యేకమైన అభినందనలు. డైరెక్టర్‌గా తను చక్కటి ప్లానింగ్‌తో సినిమాలోని ప్రతీ సీన్‌ను ముందుగా డిజైన్ చేసుకోవటం వల్ల బాగా తీయగలిగారు' అని చిరంజీవి అన్నారు.