Murari Movie Re Release :మహేశ్ బాబు హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో 23 ఏళ్ల కిందట వచ్చిన సెన్సేషనల్ మూవీ మురారి. మహేశ్ హీరోగా నటించిన 4వ చిత్రం ఇది. ఇప్పుడు మహేశ్ బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 9న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రీ రిలీజ్ కాబట్టి సినిమా కథ మనకు తెలుసు, మరి ఈ సినిమా వెనక ఉన్న కథలేంటో చూద్దామా?
కృష్ణతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత ఎన్.రామలింగేశ్వరావు. ఆతను కృష్ణవంశీ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా నిర్మించాలని అనుకున్నారు. దీంతో సముద్రం సినిమా పూర్తయ్యాక ఆ పనిలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు కృష్ణవంశీ. అప్పుడు జరిగిన ఆ చర్చల్లోనే ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులంతా అకాల మరణం చెందుతున్నారు అనే టాపిక్ వచ్చిందట. అప్పుడు ఎవరో ఇదంతా ఒక శాపం కారణంగానే అన్నారట. ఆ మాటే కృష్ణవంశీ మదిలో కథలా రూపు దిద్దుకోవటం మొదలైంది. మనోహరంగా ఉండే మహేశ్ బాబు చుట్టూ బృందావనం, అలాగే ఈ శాపాన్ని అన్నీ కలిపి కథ రాసుకుంటే బాగుంటుందనుకున్నారట కృష్ణవంశీ.
అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేమ కథ చేయాలనేది మహేశ్ బాబు ఆలోచన. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రొమాంటిక్ స్టోరీ వినిపించారట కృష్ణవంశీ. దానికి కృష్ణ, మహేశ్ కూడా ఓకే చెప్పారు. కానీ ఎవరు ఎన్ని అన్నా ప్రేమ కథను తెరకెక్కించడం కృష్ణవంశీకి ఇష్టం లేకపోవడంతో, పట్టు బట్టి ముందు అనుకున్న స్టోరీకే మహేశ్ చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ కృష్ణ ముకుందా మురారి.
హీరోయిన్గా ఎవరిని అనుకున్నారంటే -ఈ సినిమాలో మహేశ్‌కు తగ్గ జోడీగా కనిపిస్తుంది సోనాలీ బింద్రే. అయితే మొదట మాత్రం హేమమాలిని కుమార్తె ఈషా దేఓల్, లేదా వసుంధర దాస్‌లలో ఎవరో ఒకరిని అనుకున్నారట. కానీ చివరికి సోనాలి బింద్రే ఫైనల్ అయ్యారు. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా. అలాగే సినిమాలో కీలకమైన బామ్మ పాత్రకు షావుకారు జానకిని ఫిక్స్ చేసుకున్నారు. అయితే డేట్స్‌లో సర్దుబాటు కాకపోవడంతో మలయాళ నటి సుకుమారిని బామ్మ పాత్రకు ఎంపిక చేశారు.
సినిమాలోని డుమ్ డుమ్ డుమ్ నటరాజ ఆడాలి పాటను తెరకెక్కిస్తున్న సమయంలో, అలాగే వాటర్ ఫైట్ సమయంలో మహేశ్ బాగా జ్వరంతో ఉన్నారట. అయితే షెడ్యూల్ మిస్ అవ్వకూడదని జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా మహేశ్ షూటింగ్లో పాల్గొన్నారట. ఇంకా హాలీవుడ్ మూవీ టెర్మినేటర్‌లోని జైలు సన్నివేశం స్ఫూర్తితో చెప్పమ్మా చెప్పమ్మా పాటలో ముగ్గు సోనాలి బింద్రే మారేలా చిత్రీకరించారట.