Coolie Movie Nagarjuna Video Leaked : అక్కినేని నాగార్జున ప్రస్తుతం తనలోని కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న కుబేరలో, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న కూలిలో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ ఆయన భిన్నంగా కనిపించబోతున్నారని మొదటి నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది.
కూలి సినిమా విషయానికొస్తే ఇందులో నాగ్ సైమన్ అనే పాత్రలో కనిపించనున్నారు. వైల్డ్‌గా కనిపిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా కూలి చిత్రంలో నాగార్జున పాత్ర ఎంత వైల్డ్‌గా ఉండబోతుందో తెలిసేలా ఓ వీడియో బయటకు లీక్ అయింది. నాగార్జునపై చిత్రీకరిస్తున్న ఓ యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చుట్టూ వందల మంది ఉండగా నాగ్ మధ్యలో నిలబడి ఓ వ్యక్తిని అతి కూర్రంగా కొడుతూ కనిపించారు. సుత్తితో బలంగా ఆ వ్యక్తి ముఖంపై కొడుతూ, ఏదో డైలాగ్ చెబుతూ కనిపించారు.
ఇది చూసిన నెటిజన్లు విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ తరహాలో నాగ్ పాత్ర క్రూరంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోనూ తెగ షేర్ చేస్తున్నారు. సినిమా పక్కా రూ.1000 కోట్లు అని చెబుతున్నారు.