Laapata Ladies Nitashi Goel : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం 'లాపతా లేడీస్'. ఈ కామెడీ సైటెరికల్ ఫీల్ గుడ్ మూవీ నిర్మాణంలో ఆమిర్ ఖాన్ కూడా భాగస్వామ్యమయ్యారు. మార్చి 1న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే ఈ సినిమాలో పూల్ కుమారి అమాయక పాత్రలో ఒదిగిపోయిన యువనటి నితాన్షి గోయల్ గురించి ఇప్పుడొక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అదేంటంటే?
'లాపతా లేడీస్' మూవీ షూటింగ్ జరిగినప్పుడు తాను 9వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అయ్యానని నితాన్షి గోయల్ తెలిపారు. సినిమా చిత్రీకరణ మధ్య దొరికిన విరామంలో పరీక్షలకు సిద్ధమయ్యానని ఆమె ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్లాబదియా పోడ్కాస్ట్లో వెల్లడించారు. ఆ షూటింగ్ సమయంలోనే తాను పరీక్షలకు హాజరయ్యాని చెప్పుకొచ్చారు. అలాగే షూటింగ్ పూర్తయిన ఒక రోజు తర్వాత కూడా పరీక్షలను రాశానని అన్నారు.
"నేను ఎక్కువగా షూటింగ్ స్పాట్‌కు సైన్స్, మ్యాథ్స్ బుక్స్‌ను తీసుకెళ్లేదాన్ని. నా తల్లి టీచర్. ఆమె నాకు సందేహాలు ఉంటే చెప్పేది. షూటింగ్ స్పాట్లోనే 9వ తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యా." అని యువ నటి నితాన్షి గోయల్ చెప్పుకొచ్చారు. కాగా, 16 ఏళ్ల వయసులో ఈ అమ్మడు అటు సినిమాల్లోనూ, ఇటు చదువును రెండింటి బ్యాలెన్స్ చేస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.