Yash Ramayana Movie : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద సినిమాగా రానుంది రామాయణ. బాలీవుడ్ భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలానే చిత్రంలో రావణుడిగానూ నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగింది.
తాజాగా దీనిపై యశ్ స్పందించారు. రావణుడి పాత్ర చేయడం నిజమేనని స్పష్టత ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నార్త్, సౌత్ నటులను రామాయణలో భాగం చేయాలనుకున్నాం. హీరోయిన్‌గా సాయి పల్లవిని దర్శకుడు నితేశ్ తివారీనే తీసుకున్నారు. ఒకవేళ సినిమాలో నన్ను మరో పాత్ర ఏదైనా చేయమంటే నటించేవాడిని కాదేమో. ఓ నటుడిగా రావణుడి పాత్ర చేయడం నాకు ఇష్టం. ఆ క్యారెక్టర్‌లో పలు షేడ్స్ ఉంటాయి" అని అన్నారు.
ఇంకా తాజా ఇంటర్వ్యూలో కేజీయఫ్ 3, సలార్, టాక్సిక్ సినిమాల గురించి కూడా మాట్లాడారు యశ్. "టాక్సిక్ సినిమా మాసీ, మెగా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌గా ఉంటుంది. అయితే ఈ చిత్రం ముందుగా ప్రకటించినట్టు 2025 ఏప్రిల్‌లో రావట్లేదు. వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ సరైన సమయంలో ప్రకటిిస్తాం. గీతూ మోహన్‌దాస్‌కు మాస్ పల్స్ బాగా తెలుసు. గతంలో ఆమె ఎలాంటి చిత్రాలు చేశారు, వాటి ఫలితమేంటి? అనేది కాకుండా ప్రస్తుతం ఆమె ఏం కథ చెప్పాలనుకుంటున్నారనేది చూశాను. ఈ చిత్రంలో మహిళా పాత్రలు చాలా ఉన్నాయి. ఆ హీరోయిన్ల పేర్లను త్వరలోనే తెలియజేస్తాం. DNEG కంపెనీ టాక్సిక్ వీఎఫ్ఎక్స్ పనులు చేస్తోంది. దీంతో నేను లాస్ ఏంజెల్స్ వెళ్లాను. అప్పుడే ఆ సంస్థ సీఈవో నమిత్ మల్హోత్రను కలిశాను. ఆయనే 'రామాయణ' టాపిక్ తీసుకొచ్చి, ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా సాధ్యపడట్లేదని చెప్పారు. భారతీయ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న ఆయన విజన్ నన్ను ఆకర్షించడంతో రామాయణ ప్రాజెక్టుకు సహ నిర్మాతలుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా. " అని చెప్పారు. ఇకపోతే ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.