తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

2024లో మాలీవుడ్​కు భారీ లాస్​- 199 చిత్రాల్లో 26 మాత్రమే హిట్‌- మిగతావన్నీ ఫట్! - MOLLYWOOD 2024

2024లో బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టిన మలయాళ సినిమాలు- 199 సినిమాల్లో 26 మాత్రమే హిట్- రూ.700కోట్ల మేర నష్టపోయామన్న కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్‌

Mollywood 2024
Mollywood 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2024, 3:45 PM IST

Mollywood 2024 : మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఈ ఏడాది కూడా ఎన్నో అద్భుతమైన కథలను ప్రేక్షకులకు మలయాళ చిత్ర పరిశ్రమ అందించింది. యువ హీరోలు, అగ్ర కథానాయకులు విభిన్న చిత్రాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు. అలాగే మాలీవుడ్ నుంచి నుంచి వచ్చిన పలు సినిమాలు వేరే భాషల్లోనూ విజయం సాధించాయి.

రూ.700 కోట్ల నష్టం
అయితే 2024లో తమకు రూ.700 కోట్లమేర నష్టం వాటిల్లిందని కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్‌ వెల్లడించింది. ఈ ఏడాది మొత్తంగా 199 చిత్రాలు వచ్చాయని, వాటి నిర్మాణం కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు అయిందని పేర్కొంది. అందులో కేవలం 26 చిత్రాలు మాత్రమే విజయం సాధించాయని తెలిపింది. పెట్టిన ఖర్చులో కేవలం రూ.300 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయని, మిగతా రూ.700 కోట్లు నష్టపోయామని వెల్లడించింది. నిర్మాణ విలువ, హీరోల పారితోషికం భారీగా పెరగడం వల్ల తమకు రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిందని స్పష్టం చేసింది.

కొన్ని సినిమాలే హిట్
2024లో కొన్ని మలయాళ సినిమాలు మాత్రమే బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. 'మంజుమ్మల్‌ బాయ్స్', 'ఆడు జీవితం', 'ఎ.ఆర్‌.ఎం.', 'ఆవేశం', 'ప్రేమలు'’, 'భ్రమయుగం', 'సూక్ష్మ దర్శిని' వంటి సినిమాలు థియేటర్లలో విడుదలై హిట్ టాక్ ను సంపాదించుకున్నాయి. తెలుగులోనూ ఆయా చిత్రాలకు మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్‌ ఇలాంటి ప్రకటన విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

మంజుమ్మల్ బాయ్స్ రికార్డు కలెక్షన్లు
2024 ఫిబ్రవరిలో విడుదలైన 'మంజుమ్మల్‌ బాయ్స్‌' రూ.240 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డుకెక్కింది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన 'ఆడు జీవితం', టొవినో థామస్‌ యాక్ట్‌ చేసిన 'ఎ.ఆర్‌.ఎం', నస్లేన్ కె. గఫూర్‌, మమతా బైజు జంటగా నటించిన 'ప్రేమలు' రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. కొత్త చిత్రాలు మాత్రమే కాకుండా ఒకప్పటి హిట్‌ చిత్రాలు కూడా ఈ ఏడాది రీ రిలీజ్‌ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. మోహన్‌ లాల్‌ నటించిన 'దేవదూతన్‌', 'మణిచిత్రతాళు' సినిమాలను రీరిలీజ్‌ చేయగా మరోసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ABOUT THE AUTHOR

...view details