Kalki 2898 AD Movie Krishna Role : భారీ అంచనాలతో విడుదలైన కల్కి 2898 ఏడీ ఊహించిన దాని కన్నా అతి పెద్ద భారీ సక్సెస్ అందుకుంది. ప్రీమియర్ షోస్ నుంచే ఎపిక్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. కథ, విజువల్స్‌తో పాటు ఊహించని గెస్ట్ రోల్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆడియెన్స్‌ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది.
అయితే ఈ చిత్రంలో కృష్ణుడిగా నటించిందెవరా? అని సినిమా చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. దీంతో నెట్టింట్లో ఈ విషయం ఫుల్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎందుకంటే సినిమాలో కురుక్షేత్రం బ్యక్డ్రాప్తో సాగే కొన్ని సన్నివేశాల్లో కృష్ణుడి పాత్రధారి ముఖాన్ని చూపించలేదు. అయితే కృష్ణుడు పాత్ర పోషించిన వ్యక్తి నడక తీరును గమనించిన ప్రేక్షకులు కొందరు హీరో నాని అని అనుకుంటున్నారు. మరికొంతమంది ఇతర హీరోల పేర్లు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే స్వయంగా కృష్ణుడు పాత్ర పోషించిన నటుడే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీంతో అందరికీ సమాధానం దొరికింది. ఆయన మరెవరో కాదు తమిళ నటుడు కృష్ణ కుమార్ (కేకే). ఈయన చాలా మంది తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. డబ్బింగ్ మూవీ ఆకాశం నీ హద్దురాలో నటించారు. సూర్య హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ఆయనకు స్నేహితుడిగా కనిపించారు కేకే. అలానే ధనుశ్ మారన్‌లోనూ కీలక పాత్రలో కనిపించారు. వాస్తవానికి 2010లో కాదళగి చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కేకేకు కల్కి ఐదో సినిమా.