Jr Ntr Energy Secret : కఠినమైన స్టెప్స్‌ను కూడా సులువుగా చేయగలిగే ఎనర్జీకి, ఎంతటి పెద్ద డైలాగులైనా గుక్క తిప్పుకోకుండా అవలీలగా చెప్పే టాలెంట్‌కు, ఎలాంటి ఎమోషన్ అయినా సులువుగా పండించే యాక్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే నటుడు జూనియర్ ఎన్టీఆర్. అయితే అంత ఎనర్జిటిక్‌గా డాన్స్ చేయడానికి, పెద్ద పెద్ద డైలాగులను సులువుగా చెప్పడానికీ తారక్‌కు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. తాజాగా ఈ గ్లోబర్ స్టార్ ఎనర్జీ వెనక ఉన్న సీక్రెట్ గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అంతే కాకుండా తారక్ గురించి చాలా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ తన యుక్త వయసులో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ ఆడేవారట. అప్పట్లో బ్యాడ్మింటన్ ఆటలో తారక్ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారట. తన ఫిట్నెస్, వేగం వెనక ఉన్న కారణం తాను అథ్లెట్ కావడమే అని తారక్ స్వయంగా చెప్పుకొచ్చారని సెంథిల్ వెల్లడించారు. ఇవే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ పొందిన డాన్సర్ అన్న విషయం మనకు తెలిసిందే. వీటితో పాటు బ్యాడ్మింటన్ ఆటగాడు కావడం వల్లే తారక్ ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఫిట్‌గా ఉంటారని అర్థమవుతోంది.
కెమెరాకు కూడా చిక్కని ఎన్టీఆర్ పరుగు
ఇదే ఇంటర్వ్యూలో మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు సెంథిల్. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్‌ను చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారట. షూటింగ్ సమయంలో తారక్‌ను పులితో పాటు చాలా జంతువులు వెంబడించాయట. కెమెరా రోల్ అవుతున్నప్పుడు తారక్ కెమెరా కన్నా వేగంగా పరిగెత్తేవారట. ఆ క్షణం ఎన్టీఆర్ వేగాన్ని చూసి షాక్ అయిన సెంథిల్ తనకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని ఆశర్చర్యపోయారట.