Jr NTR Birthday Special: ఆ ఫ్యామిలీ దాదాపు అందరూ సినీ స్టార్సే. టాలీవుడ్ సినిమాలకు ఓ కొత్త ఉనికి తెచ్చిన వాళ్లందరూ ఆ ఇంట్లో ఉన్నారు. అలా చిన్నప్పటి నుంచే సినీ వాతావరణంలో పెరిగిన ఓ కుర్రాడు, బాల నటుడిగా మెప్పించి, తొలి సినిమాతోనే సూపర్‌హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. డ్యాన్స్, యాక్షన్ ఇలా అన్నింటిలోనూ టాప్‌గా పేరొందాడు. యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా ఎదిగారు. ఇంతకీ ఆయనెవరో మీకు ఇప్పటికే తెలిసిపోయింది కదా. అవును ఆయనే మన జూనియర్ ఎన్టీఆర్. 'రామయణం'లో బుజ్జి రాముడిగా కనిపించి ప్రేక్షకులను మురిపించిన ఈ స్టార్, ఇప్పుడు 'దేవర'గా అభిమానులను పలకరించనున్నారు. నేడు(మే 20) జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే. ఈ నేపథ్యంలో ఈ స్టార్ హీరో గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.
జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు తారక్ రామ్. తన తాత సూచన మేరకు ఆయన నందమూరి తారక రామారావుగా మారారు. ఒకానొక సమయంలో సీనియర్ ఎన్టీఆర్ తనను పిలవగా, ఆయన్ను కలిసేందుకు తారక్ వెళ్లారు. అప్పుడు ఆయన తారక్‌ను 'నీ పేరేంటి?' అని అడగ్గా, తారక్ తన పేరు చెప్పారట. అది విన్న వెంటనే సీనియర్ ఎన్టీర్, తారక్ తండ్రి అయిన హరికృష్ణను పిలిచి ఇకపై 'నందమూరి తారక రామారావు' అని పిలవండి అంటూ సూచించారట. అలా తారక్ రామ్ కాస్త నందమూరి తారక రామారావుగా మారారు.
కెరీర్ తొలినాళ్లలో తారక్ చాలా బొద్దుగా కనిపించేవారు. తొలి సినిమా అయిన 'నిన్ను చూడాలని', ఆ తర్వాతి 'స్టూడెంట్ నెంబర్.1' ఇలా పలు సినిమాల్లో ఆయన అలానే కనిపించారు. బరువు తగ్గాలని అనుకున్నప్పటికీ ప్రయత్నం చేయలేదు. దీంతో ఆయన ఫిజిక్‌పై పలు కామెంట్లు ఎదుర్కొన్నారు. 'హరికృష్ణకు నాన్నలా ఉన్నావ్' అంటూ ట్రోల్ కూడా చేశారు. దీంతో 'రాఖీ' సినిమాలోని తన లుక్ చూశాక 'సన్నగా అయ్యేందుకు ఎందుకు ప్రయత్నించలేకపోతున్నా' అంటూ తనపై తానే కోపగించుకున్నారట. అలా శ్రమించి 'యమదొంగ' సినిమాలో స్లిమ్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.