Indian 2 Movie Case :విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు 2' సినిమాకు మరో చిక్కు ఎదురైంది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆసాన్ రాజేంద్రన్ అనే వ్యక్తి మదురై జిల్లా కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ను ఈ సినిమాలో ఉపయోగించారని థియేటర్, ఓటీటీలోనూ రిలీజ్ కాకుండా 'భారతీయుడు 2'పై నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై స్పందించాలని 'భారతీయుడు 2' చిత్ర బృందాన్ని ఆదేశిస్తూ కోర్టు తదుపరి విచారణను జులై 11కు వాయిదా వేసింది.
'భారతీయుడు'లో పేరు
ప్రాచీన యుద్ధకళల్లో ఒకటైన మర్మకళలో రాజేంద్రన్ ప్రసిద్ధుడు. ఆయన మదురైలో మార్షల్ ఆర్ట్స్ అండ్ రీసెర్చ్ అకాడమీలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తాను రాసిన పుస్తకం చదివి స్ఫూర్తిపొందిన దర్శకుడు శంకర్ 'భారతీయుడు'లో మర్మకళకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారని మదురై జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో రాజేంద్రన్ పేర్కొన్నారు. అందుకు తన పేరు కూడా సినిమా టైటిల్ కార్డులో వేశారని తెలిపారు. అయితే, దానికి సీక్వెల్‌గా రూపొందిన 'భారతీయుడు 2'లో తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్ వినియోగించుకున్నారనేది రాజేంద్రన్ వాదన. జులై 12న రిలీజ్ కానున్న 'భారతీయుడు 2'ను విడుదల చేయకుండా ఆపాలని మదురై జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు చిత్రబృందం సమాధానం చెప్పాలని సూచించింది.
'భారతీయుడు 2కు సంబంధం లేదు'
"మర్మకళ టీచర్ రాజేంద్రన్ 1993, 1994లో 2 పుస్తకాలు రాశారు. అందులో మర్మకళ గురించి సవివరమైన సమాచారం ఉంది. ఆ పుస్తకంలోని సమాచారం ఆధారంగా రాజేంద్రన్‌ను సంప్రదింపులు జరిపి భారతీయుడు సినిమా తీశారు. కానీ 'ఇండియన్ 2' సినిమాలో రాజేంద్రన్‌ను సంప్రదించకుండానే మర్మకళ టెక్నిక్స్‌ను ఉపయోగించారు. 'ఇండియన్ 2' టైటిల్ కార్డులో మర్మకళ టీచర్ రాజేంద్రన్ పేరు వేయాలి." అని రాజేంద్రన్ తరపు న్యాయవాది ప్రభు కోర్టులో వాదించారు. మరోవైపు, మర్మకళ ప్రపంచ స్థాయి కళని దర్శకుడు శంకర్ తరఫున న్యాయవాది సాయి కుమారన్ కోర్టుకు హాజరయ్యారు. మర్మకళను అగస్త్యర్ కనిపెట్టారని పేర్కొన్నారు. 'భారతీయుడు 2'కు ఆసన్ రాజేంద్రన్‌కు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో వాదనలు వినిపించారు.