IMDB Top Rated Movies :థియేటర్లలో విడుదలయ్యే కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద, టీవీల్లో రిలీజయ్యే సీరియల్స్ స్మాల్‌స్క్రీన్‌పై కలెక్షన్స్ పరంగా, ఆదరణ పరంగా రికార్డులు బ్రేక్ చేసి సూపర్ హిట్‌గా నిలుస్తుంటాయి. మరికొన్ని సినిమాలు, ధారావాహికలను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. జీవితాంతం వాటిని గుర్తుపెట్టుకుంటారు. అయితే అలా మంచి టాక్ తెచ్చుకునే సినిమాలకు, వెబ్‌సిరీస్‌లకు, సీరియల్స్‌కు, టీవీషోలకు ప్రముఖ ఆన్లైన్ డేటాబేస్ సంస్థ ఐఎండీబీ రేటింగ్‌లు ఇస్తుంటుంది. అలా IMDB వద్ద మంచి రేటింగ్ సాధించిన చిత్రాలు, షోలు, వెబ్‌సిరీస్‌లు, సీరియల్స్ కొన్ని ఉన్నాయి. ఇవి ఐఎండీబీ ఇచ్చే హైయెస్ట్ రేటింగ్ 10కి 9 రేటింగ్‌ను దక్కించుకున్నాయి.
రామాయణ్ సీరియల్(1987-1988)
వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ ఆధారంగా దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన 'రామాయణ్' ఒక హిందీ సీరియల్. ఈ ధారావాహిక ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన పౌరాణిక సీరియల్‌గా 'రామాయణ్' రికార్డు సృష్టించింది. ఇది 1987లో డీడీ ఛానల్లో ప్రసారమైంది.
అహ నా పెళ్లంట(1987)
రాజేంద్రప్రసాద్, రజనీ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన 'అహ నా పెళ్లంట' తెలుగు సినిమా ఇప్పటికీ ఓ కామెడీ సెన్సేషన్. ఈ సినిమాలో బ్రహ్మానందం చేసిన కామెడీ, డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఈ సినిమా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓ మైలురాయిగా నిలిచింది.
ఆషి హి బన్వా బన్వి(1988)
1966లో హృషికేశ్ ముఖర్జీ తెరకెక్కించిన 'బీవీ ఔర్ మకాన్' ఆధారంగా 'ఆషి హి బన్వా బన్వి' మరాఠీ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు, నటుడు సచిన్ పిల్గాఓంకర్ దీనిని రూపొందించారు. ఆయన తీసిన కల్ట్ సినిమాలలో ఇదీ ఒకటి.