Lemon Benefits for Skin: నిమ్మ వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ఫలితంగా చాలా మంది తమ దినచర్యలో నిమ్మరసాన్ని భాగంగా చేసుకుంటారు. ఇలా నిమ్మ వల్ల కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా.. సౌందర్యపరంగానూ అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అందుకే దీన్ని ఫేస్‌ప్యాకుల్లో, హెయిర్ మాస్కుల్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిమ్మ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చుండ్రుకు చెక్
ఈ చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుుతుంటుంది. ఇందుకోసం నీళ్లు, అల్లం రసం, నిమ్మరసం, ఆలివ్ నూనె కొద్దికొద్దిగా తీసుకుని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలట. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరే వరకు అలాగే ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే డాండ్రఫ్ సమస్య తగ్గిపోతుందని అంటున్నారు.
ముఖ కాంతికి!
నిమ్మలో సహజసిద్ధమైన క్లెన్సింగ్ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల చర్మం శుభ్రపడి ప్రకాశవంతంగా కనిపిస్తుందని అంటున్నారు. 2015లో Journal of Cosmetic Dermatology ప్రచురితమైన "The Effects of Citric Acid on Melanogenesis and Skin Whitening" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఇందుకోసం నిమ్మకాయని రెండు ముక్కలుగా చేసి ఒక దాంతో ముఖం, మెడ మీద 5 నిమిషాల పాటు బాగా రుద్ది.. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలట. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు. ఇంకా ముఖం మీద వచ్చే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలకు కూడా నిమ్మరసంతో చెక్ పెట్టవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
జిడ్డు మాయం
సాధారణ చర్మతత్వం ఉన్న వారితో పోల్చితే జిడ్డు చర్మతత్వం ఉన్న వారిలో సమస్యలు కాస్త ఎక్కువగానే ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారికి నిమ్మరసం చక్కగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. చర్మంలో సీబమ్ ఉత్పత్తిని బ్యాలన్స్ చేసి తద్వారా జిడ్డుదనం తగ్గించడంలో నిమ్మ ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు. ఇందుకోసం నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి దూదితో ముఖానికి పట్టించి.. కాసేపయ్యాక కడిగేసుకుంటే సరిపోతుందని అంటున్నారు.. ఇలా తరచూ చేస్తుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇవి ప్రయత్నించండి!
మనలో చాలా మందికి గోళ్లు పొడవుగా, అందంగా పెంచుకోవాలని అనుకుంటారు. ఇవి కొందరికి సాధ్యపడినా.. మరికొందరికి కొంచెం పొడవు పెరిగిన వెంటనే విరిగిపోతుంటాయి. ఇలాంటి వారు ఒక గిన్నెలో కొద్దిగా నిమ్మరసం తీసుకుని దానిలో తగినన్ని నీళ్లు కలిపి బాగా మిక్స్ చేయాలట. ఇందులో కాసేపు గోళ్లను ముంచి ఉంచడం వల్ల అవి దృఢంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా కొందరికి దంతాలు పసుపు పచ్చగా మారడం వల్ల ఇబ్బందిగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు చిటికెడు ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా మిశ్రమంలో నిమ్మచెక్కను ముంచి దాంతో పళ్ల మీద రుద్దితే సరిపోతుందని చెబుతున్నారు. ఈ చిట్కా నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుందని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చలికి బరువు పెరుగుతారట మీకు తెలుసా? ఇలా చేస్తే ఈజీగా తగ్గొచ్చట!
ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్నారా? అయితే మీ ఆయుష్షు పెరగడం పక్కా! ఎలానో తెలుసా?