Siddharth Pushpa 2 : 'పుష్ప 2' ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరే రెస్పాన్స్‌తో దూసుకెళ్తూ భారీ వసూళ్లను అందుకుంటోంది. ఆరు రోజుల్లో రూ.1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు పాట్నాలో ఓ చిత్రానికి సంబంధించి ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఆ కార్యక్రమానికి లక్షల్లో జనాలు హాజరై సందడి చేశారు. అయితే దీనిపై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఆ మధ్య చర్చనీయాంశమయ్యాయి. దీంతో అతడిపై ప్రేక్షకులు విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే తాజాగా సిద్ధార్థ్ తాను చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. 'మీకు అల్లు అర్జున్‌తో ఏదైనా సమస్య ఉందా?' అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ఎవరితోనూ తనకు వ్యక్తిగత సమస్యలు లేవని స్పష్టం చేశారు. తన కొత్త సినిమా 'మిస్ యూ' ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ విషయం గురించి స్పందించారు.
"నాకు ఎవరితోనూ సమస్యలేవు. పుష్ప 2 మంచి విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. పుష్ప సూపర్ సక్సెస్ అయిందే కాబట్టే దాని సీక్వెల్ చూసేందుకు ఆడియెన్స్ భారీగా థియేటర్లకు వెళ్తున్నారు. ఈవెంట్లకు ఎంతమంది జనాలు వస్తే అంత మంచిది. థియేటర్‌లకు కూడా జనాలు రావాలని ఆశిద్దాం. ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. మేమంతా (నటీనటులు) ఒకే పడవలో జర్నీ చేస్తున్నాం. 100 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒకటి హిట్ అవుతుంది. ఆర్టిస్టులందరికీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి" అని సిద్ధార్థ్ పేర్కొన్నారు.