Hero Karthi Apology To PawanKalyan On Laddu Controversy :తిరుపతి లడ్డు కల్తీ వివాదంలో వస్తోన్న విమర్శల నేపథ్యంలో తాజాగా నటుడు కార్తి చేసిన కామెంట్స్‌పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అయితే ఈ విషయంపై స్పందించిన కార్తి తాజాగా పవన్‌కు సారీ చెప్పారు.
"పవన్‌కల్యాణ్‌పై నాకు ఎంతో గౌరవం ఉంది. నా వ్యాఖ్యలపై అనుకోని అపార్థానికి దారితీసినందుకు క్షమాపణ కోరుతున్నాను. నేను వెంకటేశ్వరస్వామి భక్తుడినే. ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను" అంటూ కార్తి క్షమాపణలు కోరారు.
అసలేం జరిగిందంటే?
కోలీవుడ్ హీరో కార్తి ప్రస్తుతం తన తాజా మూవీ 'సత్యం సుందరం' ప్రమోషన్స్‌తో బీజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన యాంకర్‌తో చేసిన ఓ చిన్న ఫన్ కాస్త కాంట్రవర్సీకి దారి తీసింది. కార్తిపై వచ్చిన మీమ్స్ గురించి మాట్లాడే సందర్భంగా 'లడ్డు కావాలా నాయన' అంటూ యాంకర్ అనడం, 'లడ్డు ఇప్పుడు మనకు వద్దు, అది చాలా సెన్సిటివ్ టాపిక్' అంటూ కార్తి తిరిగి అనడం, దానికి చుట్టూ ఉన్నవారు నవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.