Singer Bhavatharini AI Song:స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తన లేటెస్ట్ మూవీ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT)లో AI సాయంతో ఓ పాట పాడించినట్లు గుర్తుచేసున్నారు. తాజాగా ఈ సినిమా విశేషాలు షేర్ చేసుకున్న వెంకట్ ప్రభు, దివగంత సింగర్ భవతారణిని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఆమెతో సినిమాలో ఓ పాట పాడించాలని నిర్ణయించుకున్నానని, సంబంధిత ట్యూన్ కంపోజ్ పూర్తయిన రోజే భవతారణిని మరణించారని పేర్కొన్నారు. ఆ వార్త విని తట్టుకోలేకపోయానన్న వెంకట్ ప్రభు, అదే పాటలో ఆమె గాత్రాన్ని ఎలా వినిపించారో వివరించారు.
'సినిమాలో 'చిన్న చిన్న కంగళ్' సాంగ్ థీమ్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఓ రోజు నాకు చెప్పాడు. ఆ పాటను తన సోదరి భవతారణితో పాడించాలని మేం నిర్ణయించుకున్నాం. అయితే ఈ టైమ్‌లో ఆమె అనారోగ్యంతో ఉన్నారు. త్వరగా కోలుకుని చెన్నై వచ్చాక ఆ పాట పాడతారనుకున్నాం. కానీ, ట్యూన్ పూర్తయిన రోజే దురదృష్టవశాత్తూ ఆమె మరణించారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో 'లాల్ సలామ్' సినిమాలోని ఓ పాటలో దివంగత గాయకుడు షాహుల్ హమీద్ గొంతును వినిపించినప్పుడు మనమెందుకు అలా చేయకూడదని యువన్‌ను అడిగా. ఆ టెక్నాలజీ గురించి రెహమాన్ టీమ్‌ను అడిగి తెలుసుకున్నాం. భవతారణి రా (Raw) వాయిస్ తీసుకుని, ప్రియదర్శిని అనే మరో సింగర్ సాయంతో ఏఐ ద్వారా మంచి అవుట్‌పుట్ తీసుకురాగలిగాం. ట్యూన్ బాగా నచ్చడం వల్ల స్వయంగా విజయ్ ఈ పాటను పాడతానన్నారు. అలా విజయ్, భవతారణి గాత్రంతో రూపొందిన ఈ పాటకు మంచి ఆదరణ దక్కింది' అని వెంకట్ పేర్కొన్నారు.