Game Changer Pre Release Event : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా తన అప్‌కమింగ్ మూవీ 'గేమ్ ఛేంజర్' టీమ్‌తో కలిసి అమెరికాలో సందడి చేశారు. అక్కడ డల్లాస్‌లో 'గేమ్ ఛేంజర్ గ్లోబల్ ఈవెంట్' పేరుతో తాజాగా ప్రీరిలీజ్ వేడుక జరిపారు. అందులో ఈ సినిమా గురించి అలాగే డైరెక్టర్ శంకర్ గురించి చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శంకర్ అభిమానులు 'గేమ్ ఛేంజర్' రూపంలో ఓ బెస్ట్ మూవీని చూడబోతున్నారని చెర్రీ అన్నారు.
"ఈ ఈవెంట్ చూస్తుంటే, నేను అమెరికాకు వచ్చినట్లుగా అస్సలు అనిపించట్లేదు. తిరిగి ఇండియాకు వెళ్లినట్లుగా ఉంది. ఓ మంచి సినిమా అందిస్తే మీరు (ప్రేక్షకులు) ఎంతగానో ఆదరిస్తారు. సరైన సినిమాలు తీయకపోతే దాన్ని అంతే స్థాయిలో విమర్శిస్తూ తిరస్కరిస్తారు. మీరెప్పుడూ అలాగే ఉండండి. కానీ, నేను హామీ మీకు ఇస్తున్నా. 'గేమ్ ఛేంజర్' మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. శంకర్ గారి ప్రతి అభిమానికి ఇదొక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ సంక్రాంతికి మా సినిమా లేకపోతే, కల్యాణ్ బాబాయ్‌ని బలవంత పెట్టి అయినా సరే ఆయన సినిమా రిలీజ్ అయ్యేలా నేను చేసేవాడిని. అసలు 'గేమ్ ఛేంజర్' డిసెంబరులో రావాల్సింది. సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి గారికి, యూవీ ప్రొడక్షన్స్ వాళ్లకు ధన్యవాదాలు చెబుతున్నాను. మామూలుగా అన్ని విషయాల్లో దిల్‌రాజు గారు మార్కులు కొట్టేస్తారు. అయితే ఈ సారి తమన్ కూడా ఎక్కడా తగ్గలేదు. మనవాడు కూడా మంచి మార్కులు కొట్టేశాడు. మీకు ఎన్న వేనుమో అన్ని ఇరుక్కు ఇంగ" అంటూ తమిళంలో మాట్లాడి రామ్‌చరణ్ నవ్వులు పూయించారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చాలా ఘటనలు ఈ సినిమాలో కనిపిస్తాయని నిర్మాత దిల్ రాజు అన్నారు. అవన్నీ నాలుగేళ్ల కిందట శంకర్‌గారు రాసుకున్న సన్నివేశాలని ఆయన తెలిపారు. అవే ఇప్పుడు ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 'గేమ్ ఛేంజర్' ఓ హై ఓల్టేజ్ మూవీ అవుతుందని ఆయన పేర్కొన్నారు.