Eagle Movie Review: సంక్రాంతి కానుకగా వస్తుందనుకున్న 'ఈగల్' పలు కారణాలతో కాస్త ఆలస్యంగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీలేని సమయంలో మంచి టైమ్ చూసుకొని ఆడియెన్స్ ముందుకొచ్చారు మాస్మహారాజా రవితేజ. మాస్ హీరోల్లో ఒకరైన ఆయన 'ధమాకా', 'వాల్తేర్ వీరయ్య' చిత్రాలతో అలరించారు. ఆ తర్వాత వచ్చిన 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. దీంతో 'ఈగల్'పై మాస్ మహారాజ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. కాగా, ఫిబ్రవరి 9న రిలీజైన చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉందా? రవితేజ ఖాతాలో ఇంకో హిట్ పడిందా? అసలు సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: ఈగల్, నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, కావ్యథాపర్, మధు, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాసరెడ్డి, అజయ్ ఘోష్ తదితరులు, సంగీతం : డేవ్ జాండ్, సినిమాటోగ్రఫీ : కమ్లీ ప్లాకీ, కరమ్ చావ్లా, ఎడిటింగ్ : కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత : టి.జి.విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, స్క్రీన్‌ప్లే : మణిబాబు కరణం, రచన, దర్శకత్వం : కార్తిక్ ఘట్టమనేని, బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
కథేంటంటే?: జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) రాసిన ఓ కథనంతో మొదలవుతుందీ 'ఈగల్' కథ. చిన్న కథనమే అయినా అది ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈగల్‌కి సంబంధించిన అంశం కావడమే అందుకు కారణం. మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ బృందాలు, నక్సలైట్లు, తీవ్రవాదులతోపాటు ఇతర దేశాలకి చెందిన వ్యక్తులకీ టార్గెట్‌గా ఉంటుంది ఈగల్. సహదేవ్ వర్మ (రవితేజ) ఒక్కడే ఈగల్‌ని ఓ నెట్‌వర్క్‌లా నడుపుతుంటాడు. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లోని ఓ పత్తి మిల్లుతోపాటు, పోలెండ్‌లోనూ ఆ నెట్‌వర్క్ మూలాలు బహిర్గతం అవుతాయి. ఇంతకీ ఈగల్‌కీ, తలకోన అడవులకీ సంబంధం ఏమిటి? సహదేవ్ వర్మ ఎవరు? అతని గతమేమిటి, ఈగల్ నెట్‌వర్క్ లక్ష్యమేమిటి? ఈ విషయాలన్నీ జర్నలిస్ట్ నళిని పరిశోధనలో ఎలా బయటికొచ్చాయనేది మూవీ.
ఎలా ఉందంటే? :స్టైలిష్ యాక్షన్ చిత్రాల హవా కొనసాగుతున్న ఈ దశలో పక్కాగా ఆ కొలతలతో రూపుదిద్దుకున్న మరో చిత్రమే ఈగల్. నిర్ణయం, నియంత, నివారణ అంటూ ఆయుధం ఎవరి చేతుల్లో ఉండాలో ఈ కథతో చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ఈగల్, దాని నెట్‌వర్క్ పరిశోధనలతో కథ ప్రారంభమవుతుంది. ఆ పరిశోధనలో అసలు విషయాలు, అసలు పాత్రలు వెలుగులోకి వచ్చే వరకూ కథ అంతగా రక్తి కట్టదు. ఈగల్ ప్రస్తావన రాగానే భయపడే వ్యక్తులు, అసలు కథని తెలుసుకునేందుకు కథానాయిక అనుపమ చేసే రకరకాల ప్రయత్నాలతోనే ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్కు ముందే ముందే అసలు కథలోకి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. విరామం తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాల తర్వాత సినిమా మరింత రసవత్తరంగా మారుతుంది.