Dulqer Salmaan Lucky Bhaskar Success Speech : మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం 'లక్కీ భాస్కర్' సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్గా థియేటరల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించి దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మువీ టీమ్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో దుల్కర్ తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
"బ్యాంకింగ్ నేపథ్యంలో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చెప్పడం నాకు కొత్తగా అనిపించింది. నా దృష్టిలో ఇదొక రియల్ స్టోరీ. పైగా మధ్య తరగతి తండ్రి పాత్రని నేను ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చేయలేదు. అయితే రియల్ లైఫ్‌లో నేను ఇప్పుడు ఓ తండ్రిని. ఇటువంటి సమయంలో లక్కీ భాస్కర్ పాత్రని చేయడం నాకు సరైన నిర్ణయం అనిపించింది. రియాలిటీతో కూడిన ఇటువంటి కథలు, పాత్రలు నటుడికి ఎంతో తృప్తినిస్తాయి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నకు ఐదుగురు తోబుట్టువులు. అందులో మా నాన్న ఒక్కరే స్టార్. మిగతావారందరూ మధ్య తరగతి వాళ్లే. మా అమ్మకూ ముగ్గురు తోబుట్టువులు. వాళ్లూ మిడిల్ క్లాస్ లైఫ్‌నే గడుపుతున్నారు. ఆ అవగాహన, అనుభవంతోనే నేను ఈ పాత్రలో నటించాను. భాస్కర్ లక్కీ ఎలాగో, నేనూ నా రియల్ లైఫ్‌లో అదృష్టం కోసం చిన్నప్పుడు ఎన్నో పగటి కలలు కంటూ ఉండేవాణ్ని. లాటరీ టికెట్ కొనాలి, అది నాకే తగలాలి అనేది ఆ కల (నవ్వుతూ). ఆ నేపథ్యంలోనే ఈ మధ్య ఓ ఆసక్తికరమైన కథ కూడా విన్నాను. ఇటువంటి పాత్రలు చేయాలి, ఇలాంటి కథలే చేయాలన్న కోరికలేమీ లేవు. అటువంటి ఎమైనా ఉంటే మనల్ని మనం పరిమితం చేసుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే స్టోరీ, క్యారెక్టర్ల విషయంలో బౌండరీలు పెట్టుకోకుండా ఉంటాను. రీమేక్‌లు కాకుండా, నా దగ్గరికి వచ్చిన కథల్లో ఇంట్రెస్టింగ్గా ఉన్న వాటిని ఎంపిక చేసుకుని వాటితో జర్నీ చేస్తుంటాను".