Director Vetri Duraisamy Dead Body Recovered : ఇంద్రావతు ఒరు నాల్ ఫేమ్ కోలీవుడ్ దర్శకుడు వెట్రి దురైసామి(45) కారు నదిలో పడి ఆయన అదృశ్యమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు తొమ్మిది రోజుల తర్వాత వెట్రి మృతదేహం లభ్యమైంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు.
వివరాల్లోకి వెళితే. హిమాచల్ ప్రదేశ్‌కు తన స్నేహితులు గోపీ నాథ్ - తంజిన్‌లతో కలిసి విహారయాత్రకు వెళ్లారు వెట్రి దురైసామి. ఆయన తన తదుపరి సినిమాల కోసం లొకేషన్స్ చూసేందుకు అక్కడికి వెళ్లారని తెలిసింది. అయితే దారి మధ్యలో ఫిబ్రవరి 4న వారి కారు అదుపుతప్పి సట్లెజ్ నదిలో పడిపోయింది. కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో తంజిన్ గుండెపోటుకు గురయ్యారని అంటున్నారు. ఆ కారణంగానే అయన కారుపై నియంత్రణ కోల్పోగా, కారు బోల్తా కొట్టి నదిలో పడిందని తెలిసింది.
గోపీ నాథ్‌కు(32) తీవ్ర గాయాలు అవ్వగా, తంజిన్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. గోపీ నాథ్ ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయాన్ని తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత వెట్రి కనిపించలేదు. మిగితా ఇద్దరి ఆచూకి మాత్రమే లభ్యమైంది. దీంతో అప్పటి నుంచి రెస్క్యూ టీమ్ వెట్రిని వెతుకుతూనే ఉంది. సెర్చ్ ఆపరేషన్‌లో రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. డ్రోన్లను కూడా ఉపయోగించారు. అలానే ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ. కోటి రూపాయల రివార్డును కూడా ప్రకటించింది దర్శకుడి కుటుంబం.