Akhanda 2 Shooting Kumbh Mela :నందమూరి నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్లో డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా 'అఖండ 2: తాండవం'. 2021లో బ్లాక్బస్టర్ విజయం అందుకున్న 'అఖండ'కు ఇది సీక్వెల్గా తెరకెక్కుతోంది. ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్, ప్రస్తుతం అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో జరుగుతోంది.
ఈ క్రమంలో దర్శకుడు బోయపాటి షూటింగ్ అప్డేట్ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ నెల 11న ప్రారంభమైన ఈ షెడ్యూల్ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుందని ఆయన తెలిపారు. కోట్ల మందిలో కూడా షూటింగ్ చేస్తున్నామంటే తమ ప్రయత్నం ఎంత గట్టిదో అర్థం చేసుకోవాలని అన్నారు.
'మహా కుంభమేళా ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాది అఘోర నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి ఇక్కడ షూట్ చేస్తున్నాం. అఘోర, నాగ సాధువులను కూడా కలిశాం. 11వ తారీకు నుంచే మేం ఇక్కడ ఉన్నాం. ఈ రోజుతో ఇక్కడ షూట్ పూర్తవుతుంది. ఇన్ని కోట్ల మందిలో కూడా మా ప్రయత్నంలో లోపం లేకుండా షూటింగ్ కొనసాగిస్తున్నాం' అని బోయపాటి పేర్కొన్నారు. ఇక కోట్లాది మంది భక్తుల మధ్యలో షూటింగ్ అనగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'థియేటర్లలో పూనకాలే' అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.